ఏపీలో అధికార పార్టీ వైసీపీలో అంతర్మథనం ప్రారంభమైందా? పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడింది. పోనీలే పట్టణాల్లో లేకున్నా.. పల్లెల్లో బలం ఉందిలే అనుకుంటే నిన్న జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. అధికార పార్టీకి దెబ్బకు దేవుడు కనిపించాడు. ఇక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది మేనిఫెస్టో. ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అంతేకాదు.. దీనికి అనుబంధంగా కీలకమైన ప్రధాన మేనిఫెస్టో మేనిఫెస్టో సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిని విడుదల చేసేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమవుతోంది.
ఇక ఇప్పుడు వైసీపీ వంతు. ఈ సారి నవరత్నాలు.. దశ రత్నాలు అంటే కలవదు. అసలే టీడీపీ తన మేనిఫెస్టోలో అనేక పథకాలకు సంబంధించిన స్ట్రాంగ్ హామీలను గుప్పించింది.ఇక వైసీపీ ఇంతకు మించిన మేనిఫెస్టోను తయారు చేయాలి. మొత్తానికి జగన్ పథకాలతోనే ఆయన సర్కారును టీడీపీ దెబ్బకొట్టింది. ఉదాహరణకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం ఇంటికి ఒక బిడ్డకు మాత్రమే వర్తింపజేస్తోంది. కానీ టీడీపీ అధికారంలోకి వస్తే.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ అమ్మఒడి అందిస్తామని టీడీపీ తన మినీ మేనిఫెస్టోలో తెలిపింది. ఇలా ఒకటి కాదు.. వరుసబెట్టి జగన్ పథకాలన్నింటినీ దెబ్బకొట్టే మాదిరిగానే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎలాంటి మేనిఫెస్టోను తయారు చేయాలి?
ముఖ్యంగా టీడీపీ తన మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేసింది. ఎన్నికల సమయానికి విడుదల చేసే మేనిఫెస్టోలో విజన్-2047 హామీ ప్రధానంగా ఉండనుంది. మొత్తానికి టీడీపీ తన మేనిఫెస్టో ద్వారా మహిళలు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులను టార్గెట్ చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ ఇంతకు మించిన మేనిఫెస్టోను తయారు చేయాలి.
నవరత్నాల కాన్సెప్టులో మార్పులు చేయాలని వైసీపీ భావిస్తోందట. ఇక ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత మెరుగులు దిద్దాలని యోచిస్తోందట. అలాగే గత ఎన్నికల మేనిఫెస్టోలను సైతం అధ్యయనం చేస్తోందట. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వైసీపీ కీలక నేతలతో అధిష్టానం రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తోందని సమాచారం. ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోను రెడీ చేయనుందట. ఈ క్రమంలోనే వైసీపీ మేనిఫెస్టో రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.