టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గుంటూరులో ముగించుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. విజయవాడ, గన్నవరం, పెనుమలూరులో తెల్లవారుజాము వరకూ పాదయాత్ర సాగడం విశేషం. అర్థరాత్రి అపరాత్రి అని లేదు.. తెల్లవారుజాము అని లేదు. నారా లోకేష్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. ఇక మొన్న అయితే సాయంత్రం 4 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజాము 3.40 గంటల వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఓ వైపు భుజం నొప్పి బాధపెడుతున్నా.. నిరంతర నడకతో కాళ్లు పట్టేసినా.. కేలండర్‌లో తేదీ మారినా నిర్విరామంగా 12 గంటల పాటు పాదయాత్ర నిర్వహించారు.
నాలుగేళ్ల వైసీపీ పాలనకు చెక్ పెట్టే రోజులు దగ్గరపడ్డాయని పరోక్షంగా చెబుతున్నట్టేనని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా వల్లభనేని వంశీని రాజకీయంగా పెంచి పోషించిన పార్టీ టీడీపీ. ఆ పార్టీ మారిన తర్వాత చంద్రబాబు కుటుంబంపై ఆయన చేసిన విమర్శలు, ఆరోపణలు జనాల్లో తీవ్ర కసిని పెంచాయి. పంచాయతీ ఉప ఎన్నికలో కూడా ఈ విషయం స్పష్టమైంది. చాలా చోట్ల జరగబోయే మార్పు, చేర్పులకు ఈ ఉపఎన్నికలు నిదర్శనంగా నిలిచాయి. ఇక ఇప్పుడు నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు జనసందోహం వెల్లువెత్తుతుండటం కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందనడానికి కూడా సంకేతంగా నిలుస్తున్నాయి.
గుంటూరు, కృష్ణా జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనవి. పార్టీకి గతంలో అత్యధిక ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలు తెచ్చిపెట్టిన జిల్లాలు కూడా ఇవే కావడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైసీపీ ప్రభంజనం జోరుగా సాగి ఆ పార్టీ 151 సీట్లు గెలుచుకున్న సమయంలో కూడా గుంటూరు, విజయవాడ ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. అయితే ఈ రెండు జిల్లాల ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నానిలు పాదయాత్రకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే లోకేష్ పాదయాత్రలో సోదరుడు కేశినేని చిన్ని యాక్టివ్‌గా మారడంతో కేశినేని నాని కాస్త దూరంగా ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరికీ చాలా కాలంగా పడటం లేదు. ఇక గల్లా జయదేవ్ మాత్రం తన సొంత పనుల్లో బిజీగా ఉండి పాదయాత్రకు దూరంగా ఉన్నట్టు సమాచారం.