అవును.. నాకు నోరు ఎక్కువ.. నేను ఎవరిపైన అయినా మాట్లాడుతాను.. ఎంత మాటైనా మాట్లాడేస్తా.. కానీ నా గురించి పొల్లెత్తు మాట అన్నా అస్సలు ఊరుకోను.. చీల్చి చెండాడుతా..! ఇదీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీరు. అధికార వైసీపీలో ఉన్న నాని.. ప్రతిపక్షంలోని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని నారా లోకేష్ వరకూ ఏ ఒక్కర్నీ వదలకుండా ఇష్టానుసారం నోరు పారేసుకున్న పరిస్థితి. ఆఖరికి జగన్ ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా సరే నిమిషాల వ్యవధిలోనే మీడియా గొట్టాల ముందు వాలిపోతుంటారు. ఈ క్రమంలో ఆ మధ్య జగన్ సర్కార్ గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ.. మంత్రులు మొదలుకుని ఎమ్మెల్యేల వరకూ నోరుపారేసుకున్నారు. ఈ పరిస్థితుల్లోనే కొడాలి నాని కూడా చిరంజీవిని ‘పకోడి గాడు’ అని సంబోధించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చిరు అభిమానులు, అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలు, నేతలు.. సొంత పార్టీలోని కొందరు చిరు వీరాభిమానులు.. వైసీపీ నేతలు సైతం నానిపై రగిలిపోయారు. ఇక సోషల్ మీడియాలో ఈ వ్యవహారం ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు.. చిరుకు క్షమాపణలు చెబితే సరే లేకుంటే.. 2024లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు మెగాభిమానులు. ఈ క్రమంలోనే నాని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇలాంటి చర్యలతో.. చిరు ఫ్యాన్స్ దెబ్బ.. నాని అబ్బా అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎట్టకేలకు కొడాలి నాని దిగొచ్చారు.
అబ్బే.. అమ్మతోడు అనలేదే!
ఆగస్టు-22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో తన తప్పు తెలుసుకున్న కొడాలి నాని నష్టనివారణ చర్యలు చేపట్టారు. పనిలో పనిగా చిరుకోసం కేక్ కట్ చేసి.. మీడియాతో మాట్లాడి అబ్బే అదేమీ లేదు.. నిజంగా చెబుతున్నాను పకోడిగాడు అనలేదని చెప్పుకొచ్చారు. చిరంజీవి గారిని నేను పకోడీ గాడు అని అనలేదు. చిరంజీవి గారిని ఆరోజు.. ఈరోజు ఎప్పుడైనా కూడా నేను గౌరవిస్తాను. చంద్రబాబునైనా, వాడి బాబు ఖర్జుర నాయుడునైనా, వాడి తాత లవంగం నాయుడునైనా, వాడి ముత్తాత యాలక్కాయ నాయుడునైనా అంటాము.. కానీ చిరంజీవి గారిని ఎప్పుడు అనలేదు’ అని నాని చెప్పుకొచ్చారు. చూశారుగా.. నానిలో ఎంత మార్పు వచ్చిందో. నాని వ్యాఖ్యలతో మెగాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ‘మెగాభిమానులు మజాకా..’.. ‘అట్లుంటది మెగాస్టార్‌తోని పెట్టుకుంటే..’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు చిరు ఫ్యాన్స్.
ఎంత మార్పో..?
వాస్తవానికి.. నాని ఏ రోజు మీడియా ముందు ఏ ఒక్కర్నీ సక్రమంగా మాట్లాడింది లేదు.. నోరు పారేసుకోవడమే.. ఇష్టమొచ్చినట్లు కూసేయడమే తప్ప.. తప్పుగా మాట్లాడానని ఏ ఒక్కరోజు పశ్చాత్తాపంగానీ.. పునరాలోచనగానీ చేసిన దాఖలాల్లేవ్. అయితే.. ఇప్పుడు చిరు గురించి అప్పట్లో అలా అనేయడం.. ఇప్పుడేమో ఇలా మాట్లాడటంతో.. నానిలో ఎంత మార్పు.. అని సొంత పార్టీ నేతలే నోరెళ్లబెడుతున్న పరిస్థితి. అంతేకాదు.. చిరును విమర్శించేంత సంస్కార హీనుడిని కాదని.. తాను విమర్శించినట్టు నిరూపించాలని సవాల్ కూడా చేయడం గమనార్హం. అంతటితో ఆగలేదు.. తాను శ్రీరామ అన్నా కూడా టీడీపీ, జనసేన నేతలకు బూతు మాటలుగా వినపడతాయని నాని చెప్పడం గమనార్హం. అంతేకాదండోయ్.. చిరంజీవితో తమకు అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్ర పన్నుతున్నాయని కూడా చెప్పేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు గుడివాడలో తన కార్యాలయం మీదుగా వెళ్తున్నప్పుడు నమస్కారం పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. మరీ ముఖ్యంగా.. చిరును పెద్దాయన అని కూడా సంబోధించారు. సలహాలు, సూచనలు ఇస్తే కచ్చితంగా పాటిస్తామని నాని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డ్యాన్సులు, యాక్షన్ రావా? తాను ఆయన గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుంది? అని విమర్శకులను ప్రశ్నించారాయన. అంతేకాదు.. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీన్ అర్థమైంది కదా.. నాని ఎందుకు ఇలా మాట్లాడారు..? పుట్టిన రోజు కేక్ కట్ చేశారన్నది క్లియర్ కట్‌గానే అర్థమై ఉంటుంది కదా..!. చూశారుగా.. ఎంత మార్పు.. ఎంత మార్పు.. చిరు ఒక్కరి విషయంలోనే ఇలానా.. లేకుంటే అందరి విషయాల్లోనూ ఇలానే నాని ఉంటారా అనేది చూడాలి మరి.