అవును.. నేను బక్కోడినే అని కేసీఆర్ చెబుతుంటారు కానీ.. ఎవరండీ ఆయన్ని అలా అనుకునేది.. అదంతా నాణెంకి ఒకవైపే.. ఇంకోవైపు ఎవరూ టచ్ చేయలేని బాహుబలి ఉన్నారు..! అదెలాగో ఒక లుక్కేద్దాం రండి..! ఎన్నేళ్లు అధికారంలో ఉన్నామన్నది ఒక ఎత్తైతే.. ఎలా ఉన్నామన్నది కూడా ముఖ్యమే. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అందే దాదాపు పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ వస్తోంది. ఈసారి కూడా ఎదురు లేదన్న ధీమానో మరొకటో కానీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాకమునుపే నాలుగు నియోజకవర్గాలు మినహా అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది కేసీఆర్ వ్యవహారశైలి. అసలు ఈ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే సీన్‌లో నుంచి మంత్రి కేటీఆర్ విదేశాలకు జంప్. ఎమ్మెల్సీ కవిత ఉన్నా.. ఫలితం సున్నా. టికెట్ రాదు అనుకున్న అభ్యర్థులంతా వెళ్లి ఆమెను కలిశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మొత్తానికి ప్రత్యర్థులకు మాత్రం జాబితాను ప్రకటించి కేసీఆర్ గట్టి సవాలే విసిరారు.
ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడుతోంది. అలాంటి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేలా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి మరీ కేసీఆర్ సవాల్ విసిరారు. ఒకవైపు బీఆర్ఎస్ పాలనపై వ్యతిరకేత బాగా పెరిగిందన్న వార్తలు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం.. వీటన్నింటి నడుమ కూడా కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. విజయంపై ఎంత గట్టి ధీమా ఉంటే కేసీఆర్ ఇలా ముందుగానే అభ్యర్థలును ప్రకటించాలి? ఇంత ముందుగా ప్రకటిస్తే టికెట్ రాని నేతల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలుసు.. పైగా తనకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పారు. అసలు ఏంటి ఆయనలో అంత ధీమా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పదేళ్ల పాలన తర్వాత జనంలోకి వెళ్లాలంటే కాస్త కొత్త మొహాలతే వెళితే బాగుంటుంది. కానీ ఆశావహుల ఆశలను తుంగలో తొక్కుతూ దాదాపు పాత వారికే అంటే సిట్టింగ్‌లకే టికెట్లు కట్టబెట్టి అవే పాత మొహాలతో జనంలోకి వెళుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్‌కు ఓటేస్తే నేతల్లో అయితే కానీ.. పాలనలో అయితే కానీ మార్పేమీ ఉండదన్న సంకేతాలను ఆయన ఇచ్చారా? మొత్తానికి బీజేపీ అయితే ముందేగానీ కేసీఆర్‌ను ఎదుర్కోలేమంటూ చేతులెత్తేసింది కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది పెను సవాలే. ఇక ఇప్పుడు అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. ఇప్పుడిక ఈ పార్టీలో టికెట్ లొల్లి షురూ అవుతుంది. మరి ఈ పార్టీ అభ్యర్థుల జాబితాపై కసరత్తును ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి. ఇక్కడ పెద్ద తంతే ఉంది. అభ్యర్థుల జాబితాను తయారు చేయడమే కాదు.. దానిని అధిష్టానం పరిశీలనకు పంపి.. అక్కడ ఓకే అయితేనే ఇక్కడ జాబితా విడుదలవుతుంది. చూశారుగా ఇందుకే బక్కోడు కాదు.. బాహుబలి.. అనేది..!