మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వినబడితే చాలు ఎన్నో ముఖాలలో చిరు నవ్వులు వెల్లివిరుస్తాయి. చిరంజీవి అనగానే స్వయంకృష్టి, మెగాస్టార్.. ఇలా ఎన్నో రకాల పేర్లు వినబడతాయి. వీటన్నింటికి మించిన మహా మనిషి, గొప్ప మానవతావాది చిరంజీవి. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని కార్యసాధకుడై.. ఈ రోజు ఎవరెస్ట్ శిఖరం అంత ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆయన గుండె హిమాలయాల వంటి మంచు పర్వతం. కష్టం కనిపిస్తే కరిగిపోతుంది.. కష్టమని తలుపు తట్టే ప్రతి చేతికి.. నేనున్నానంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చే వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు ప్రేమించడం, ఎదుటి మనిషికి సహాయం చేయడం మాత్రమే తెలుసు. అందుకే ఈ మధ్య అన్ని నోర్లు లేస్తున్నా.. కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారే తప్ప.. ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనరు. పోనీలే.. వాళ్లకు అలా అనాలని ఎందుకు అనిపించి ఉంటుందో? అంటూ తనే సర్దుకుపోతుంటారు. అలాంటి మంచి మనసు మెగాస్టార్‌ది. ఆ మనసు, శిఖరం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, తలెత్తి చూసేలానే ఉండాలని కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
చిరంజీవి గురించి ఈ మధ్య ప్రతి ఒక్కడూ కామెంట్ చేసే స్థాయికి వెళ్లిపోయారంటే.. అది వాళ్లకి ఆయన వదిలేసిన స్వేచ్ఛ. ఇంట్లో సరిగ్గా ఏడవడం రాని వాడు కూడా.. చిరంజీవి గురించి మాట్లాడేవాడే. ఒక్క సినిమా ఫ్లాప్‌తో ఆయన ఇమేజ్‌కి ఏదో డ్యామేజ్ అయినట్లుగా.. పనిగట్టుకుని మరీ ట్రోల్స్ చేస్తున్నారు. అలా కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరికీ సమాధానం.. ‘మీ బొడ్డుపేగు తెగక ముందే ఆయన స్టార్’. ఆయన చూడని హిట్సా, బ్లాక్‌బస్టర్సా. అలాగే ఏ హీరోకి ఫ్లాప్ రానట్లుగా.. ఒక్క చిరంజీవికే ప్లాప్ వచ్చినట్లుగా రాసే రాతలు, కూసే కూతలకు అంతే లేకుండా పోయింది. రేపు ఇండస్ట్రీలో ఎవడికైనా ప్రాబ్లమ్ వస్తే.. ముందు చూసేది చిరంజీవి గడపవైపేనని అంతా మరిచిపోతున్నారు. అవసరం అంటే ఆయన కావాలి.. ఆయనకు కష్టం వస్తే మాత్రం కృంగదీసేలా కామెంట్స్. ఇదేనా చిరంజీవికి ఇచ్చే గౌరవం. ఆయన ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఛాన్స్ దొరికితే చాలు.. మెగాస్టార్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకుని మరి ఈ మధ్య ఓ బ్యాచ్ దిగిపోతోంది. ఆ బ్యాచ్‌కి చెప్పేది ఒక్కటే.. మీరు ఎన్ని అయినా అనుకోండి. వాటన్నింటికి ఆయన ఇచ్చే చిరు నవ్వే సమాధానం.
పాన్ ఇండియా గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆల్ ఇండియా గుర్తించిన ఆల్‌రౌండర్ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడేదో పుష్కరం తర్వాత హిట్ కొట్టిన ఓ స్టార్‌ని లేపుతూ.. చిరంజీవిని దిగజార్చుతూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ స్టార్ కూడా ఒకప్పుడు తన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ రీమేక్ చేసుకున్నవాడే. ఇంకా అందులో అతిథి పాత్రలో కూడా చిరు నటించాల్సి వచ్చిందంటే.. అది చిరు స్టామినా. ‘సిపాయి’తో కన్నడని, ‘ప్రతిబంధ్’తో బాలీవుడ్‌ని ఎప్పుడో అల్లాడించాడు. ఆ మధ్య విశ్వనాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. నేను, రజనీకాంత్ ఉన్నామని చిరంజీవి ఇటు(తమిళం) రాలేదు కానీ.. ఆయన వచ్చి ఉంటే తమిళ ఇండస్ట్రీలోనూ ఆయన సూపర్‌స్టార్ అయ్యేవారు అని చెప్పారు. ఇది చాలదా.. చిరంజీవి స్టార్‌డమ్ గురించి చెప్పడానికి. అందుకే అంది ఆల్ ఇండియా మెచ్చిన ఆల్‌రౌండర్ చిరంజీవి అని. కొన్ని సార్లు తనని నమ్ముకున్న వారి కోసం ఆయన తగ్గుతారు. అలా ‘భోళా శంకర్’ విషయంలో మెహర్ కోసం తగ్గాడు కాబట్టే.. అలాంటి రిజల్ట్. అయినా అంతకు ముందేగా.. ఇండస్ట్రీని వీరయ్యగా షేకాడించాడు.. మరిచిపోయారా? మాటలు పేలుతున్నారు. ఆయన తిరిగి కొడితే.. బాక్సాఫీస్ కుదేలవడం ఖాయం.. అది దగ్గరలోనే ఉంది. చిరు భాషలో చెప్పాలంటే.. ‘ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడయిల్ ఫెస్టివల్’.
ఇక ఈ మధ్య ఇండస్ట్రీ అంటే ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి కాదు ఆయన మాట్లాడింది. అయినా.. అంతకు ముందే రజనీకాంత్‌ని దూషిస్తూ.. మాకు సూపర్ స్టార్ అంటే చిరంజీవే అని పలికిన వైసీపీ వర్గాల నోర్లు.. పెద్దరికంగా ఆయనొక సలహా ఇస్తే.. వెనువెంటనే విమర్శలతో దాడికి దిగిపోయారు. అసలు చిరంజీవి ఏం చెప్పారో కూడా వినకుండా.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. పార్లమెంట్‌లో హీరోల రెమ్యూనరేషన్ గురించి ఓ ఎంపీ మాట్లాడిన మాటలకు బదులుగా.. చిరంజీవి పెద్దరికంగా మాట్లాడితే, ఇంకేముంది వైసీపీకి ఆయనేదో చేటు చేశాడని పేటీఎమ్ బ్యాచ్‌ని ఎగదోశారు. అసలు ఒక్కటి అర్థం చేసుకోండి.. హీరో అనే వాడు లేకుంటే.. సినిమానే ఉండదు. అంత బిజినెస్ జరుగుతుందీ అంటే అది హీరో స్టామినా వల్లే. అది సల్మాన్ అయినా, రజనీకాంత్ అయినా, చిరంజీవి అయినా. వాళ్ల రెమ్యూనరేషన్ తగ్గిస్తే.. వాళ్లు సినిమాలు చేయడం మానేస్తారు. తద్వారా వేలమంది కార్మికులు రోడ్డున పడతారు. అదే కదా.. చిరంజీవి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. అయినా నిర్మాతకు లేని నొప్పి వాళ్లకెందుకు? మీలాగా వారికేం అలవెన్స్‌లు ఉండవు. ఏ హీరోకి, ఏ నటుడికి కాలు విరిగినా, చేయి విరిగినా.. సొంత డబ్బులతో నయం చేయించుకోవాలి. ప్రభుత్వ సొమ్మేం ఇవ్వరు. మాట్లాడమన్నారు కదా.. అని ఏది పడితే అది మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దు.
అయినా ఇండస్ట్రీ శ్రేయస్సు కోరి చిరు పెద్దరికంగా మాట్లాడితే.. ఒక్కరంటే ఒక్క నటుడు కూడా ఇండస్ట్రీ తరపున ఆయనకు మద్దతు ఇవ్వలేదు. ఇక్కడే తెలుస్తుంది ఇండస్ట్రీలోని క్యాస్ట్ వార్. కష్టం వస్తే చిరు కావాలి, సమస్య ఉంటే చిరునే తీర్చాలి. అన్నింటికి చిరు మాత్రమే కావాలి. ఆయన మాట్లాడితే మాత్రం ఒక్కరూ ముందుకు రారు. ఇలా స్వార్థంగా ఉన్నారు కాబట్టే.. అక్కడ ప్రతి ఒక్కడి నోరూ లేస్తుంది. ఇలాంటి నటులు ఉన్నారు కాబట్టే.. చిరంజీవి కూడా నాకు పెద్దరికం వద్దు అంటూ తప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన వద్దనుకున్నా.. ఇండస్ట్రీకి ఇబ్బంది అంటే.. ఆయన మనసు మాత్రం ఆగలేదు.. ఆగదు. ఇప్పటికైనా ఇండస్ట్రీలోని వారంతా కళ్లు తెరవండి.. మీ సొమ్ము ఏం ఆయన అడగడు. కావాలంటే ఆయన కోట్లు కుమ్మరించడానికి కూడా ముందుంటాడు. అలాంటి స్టార్‌ని నిలబెట్టుకోలేకపోతే.. ఆ లోపం, శాపం ఇండస్ట్రీకేనని తెలుసుకోండి. ఎవరో ఒకరిద్దరు.. ఏదో అనుకుంటారని వెనక్కి తగ్గితే.. రేపు నిలబడడానికి ఎవ్వరూ ఉండరు.
అరుదైన మనిషి చిరంజీవి. అలాంటి మనిషిని, మనసును కష్టపెట్టాలని చూడకండి. వయసును కూడా లెక్కచేయకుండా.. కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారంటే.. ఆ గుండె ధైర్యం ఏంటో అర్థం చేసుకోండి. ఏ సినిమా అయినా సరే.. ఆయన ప్రయత్నంలో లోపం ఉండదు. ప్రతి సినిమాకు ఆయన అప్పుడు, ఇప్పుడు అలాగే కష్టపడతారు. సెట్‌లో ఆయన ఉంటే.. ఉండే ఆనందమే వేరు. ఆయన ఎనర్జీ కూడా అదే. సెట్‌లో యాక్షన్, కట్ అని వినబడుతుంటే.. ఆయన మరింత యంగ్‌గా మారిపోయి.. పని చేస్తుంటారు. ఆయన సినిమాలకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. ఆయన వయసుకు, ఆయన పడే కష్టాన్నైనా కాస్త గుర్తించండి. ఇంట్లో పది మంది హీరోలు ఉన్నారు కదా.. అని ఏనాడూ ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేదు.. కూర్చోరు కూడా. వాళ్ల కంటే ఎక్కువగా కష్టపడి, వాళ్ల కంటే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారంటే అర్థం కావడం లేదా.. ఆయనొక లెజెండ్ అని. ఆ లెజెండ్‌కి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది సినీజోష్.