ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. ఇక్కడి రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రాధాన్యత పెరిగిపోవడంతో యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ యార్లగడ్డ స్థానాన్ని భర్తీ చేయాలి. దీనిపై ఫోకస్ పెట్టిన వైసీపీ ముఖ్యంగా పార్టీ శ్రేణులను కోల్పోకుండా చూసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఒకవైపు పంచాయతీ ఉప ఎన్నికల్లో పెద్ద దెబ్బే పడటంతో నియోజకవర్గంలో పార్టీ బలహీనపడకుండా ఉండేందుకు కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. యార్లగడ్డతో పాటు వెంకట్రావు వెంట వైసీపీ నేతలు, క్యాడర్ వెళ్లకుండా చూసుకోవడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా సడెన్‌గా వైసీపీ నేత దుట్టా రామచంద్రారావును కాపాడుకునే పనిలో పడింది. అప్పట్లో అంటే 2014లో వల్లభనేని వంశీపై దుట్టా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత అనూహ్యంగా యార్లగడ్డ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆయన ఎన్ఆర్ఐ కావడంతో పాటు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ నేత కావడంతో వైసీపీ దుట్టాను పక్కనబెట్టి యార్లగడ్డకు 2019లో టికెట్ కేటాయించింది. ఇక అప్పుడు యార్లగడ్డ కూడా వల్లభనేని వంశీ ధాటికి నిలవలేక ఓటమి పాలయ్యారు. ఇక వీరిద్దరినీ ఓడించారు అంటే వల్లభనేని వంశీ తోపు, తురుముగా వైసీపీ భావించింది. కానీ తాజాగా జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వంశీని అక్కడి ప్రజానీకం చావుదెబ్బ కొట్టింది. దీంతో అసలు విషయం వైసీపీ అధిష్టానానికి తెలిసొచ్చింది.
అంతా వంశీ ప్రతిభ అనుకున్న ప్రజానీకానికి ఇప్పటి వరకూ టీడీపీని చూసి వంశీకి జనం మద్దతుగా నిలిచారనేది అర్థమైంది. ఇక ఇప్పుడు వంశీకి దుట్టా సైతం యాంటీగా ఉన్నారు. ఎలాగూ యార్లగడ్డ అవుట్. ఇక దుట్టానైనా కాపాడుకుంటే పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని భావించి ఆయన్ను సీన్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా దుట్టా తన కుటుంబంతో కలిసి వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు. ఇక ఆ తరువాత పార్టీ మారే ఆలోచనే లేదని దుట్టా మీడియాకు తెలిపారు. ఇప్పుడు అసలు కథ ఏంటంటే.. దుట్టా, యార్లగడ్డలలో ఎవరి సత్తా ఏంటనేది. నిజానికి పార్టీ స్థాపించినప్పటి నుంచి దుట్టా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. యార్లగడ్డ సడెన్ ఎంట్రీ. అలాంటప్పుడు జనం ఎవరి వెంట ఉంటారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గన్నవరం రాజకీయ కురుక్షేత్రంలో యార్లగడ్డ ఒంటరిగా మిగిలిపోతారనుకోవడానికి కూడా లేదు. ఆయనకు టీడీపీ అండగా ఉంటుంది. ఇక ఇప్పుడు కదా.. ఉత్కంఠ రేపే వార్ ప్రారంభమయ్యేది. చూడాలి ఈ వార్‌లో గెలుపెవరిదో.