రెడ్డొచ్చే మొదలాయె అన్నట్టుగా మారింది ఏపీ వ్యవహారం. ముందస్తు ఎన్నికలహో అనేలోపే.. అదేమీ లేదంటూ వార్తలు.. మళ్లీ ఎవరో ఒకరు లేపుతారు.. మళ్లీ స్టార్ట్.. అదేమీ లేదని వైసీపీ సర్కార్. ఇదో సైకిల్ మాదిరిగా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ముందస్తు సంకేతాలు కనిపిస్తున్నాయంటూ న్యూస్. మరి ఇది నాన్నా పులి కథ మాదిరిగా ఈసారి సడెన్‌గా ముందస్తుకు ప్రభుత్వం వెళుతుందో లేదంటే ఇది కూడా పుకారేనా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఈసారి ముందస్తు వార్తలకు ఊతమేంటంటే.. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం మెడికల్ లీవులు మాత్రమే మంజూరు చేస్తామని తెలిపింది. అది కూడా కలెక్టర్ అనుమతి తీసుకుంటేనే అని తెలిపింది. ఇది మాత్రమే కాదు.. ఇటీవల జిల్లా కలెక్టర్లు వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. ఇది కూడా ఒక కారణం.
ఇక నిన్నటికి నిన్న ఏపీ సీఎం జగన్‌తో వైసీపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాతో పాటు ముందస్తు ఎన్నికల గురించి చర్చ జరిగిందనే టాక్ బయటకు వచ్చింది. వైసీపీ చాపకింద నీరులా ఎన్నికల సంబంధించిన పనులన్నీ చకచకా చేసుకుంటోందని.. ఈ క్రమంలోనే శరవేగంగా అభ్యర్థుల జాబితా పూర్తి చేయనుందని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడం ఖాయమని చర్చ నడుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు 151 సీట్లు తమ చేతిలో ఉన్నాయని.. సంక్షేమ పథకాలు అండగా ఉన్నాయని అలాంటప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందనడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో సంక్షేమ పథకాలకు నగదు సర్దుబాటు చేయడమనేది వైసీపీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా తయారైంది. మరోవైపు ఎన్ని సార్లని.. మద్యం బాండ్లపై అప్పులకు వెళుతుంది? ఇన్వెస్టర్లు సైతం ఛీ పో.. అన్నట్టుగా చూస్తున్నారట. ఇక ఎలాగూ కొత్త అప్పులు పుట్టే మార్గమే కనిపించడం లేదు. ఈ సమయంలో సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట వేస్తే మొదటికే మోసం వస్తుంది. మొత్తానికి ముందస్తే శరణ్యమని ప్రభుత్వం భావిస్తోందట.
ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సారి ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించి.. సచివాలయ ఉద్యోగులను సీన్‌లోకి రప్పించాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగులంతా తమకు అనుకూలురు కాబట్టి ఓట్లు కూడా తమకు అనుకూలంగా వేయించుకోవచ్చనేది వైసీపీ ఉద్దేశంగా తెలుస్తోంది. అసలే ప్రభుత్వోద్యోగులంతా వైసీపీకి యాంటీగా ఉన్నారు. కాబట్టి ఎన్నికల విధులు స్ట్రిక్ట్‌గా నిర్వహించే అవకాశం ఉందని వైసీపీ ఈ స్కెచ్ గీసింది. మరి ఇది ఏ మేరకు సాధ్యపడుతుందనేది తెలియాల్సి ఉంది