ఆశ పడి ఆరు లంకణాలు చేస్తే.. ఆయాల కూడా జొన్న కూడేనట.. అలా ఉంది బీఆర్ఎస్ నేతల పరిస్థితి. టికెట్ తప్పక వస్తుందని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుంటూ.. జనాల్లో కలియ తిరుగుతూ నానా తిప్పలు పడ్డారు. కానీ ఫలితం.. మొండి చేయి. తొలుత సిట్టింగ్స్‌కి ఢోకా లేదని.. అలాగే ఉద్యమకారులకు ప్రాధాన్యమని చెప్పుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాట తప్పింది. అసలే పార్టీలో కొద్ది మందే ఉద్యమ నేతలు మిగిలారు. వారికి కూడా నిర్మొహమాటంగా నో చెప్పేసింది. దాదాపు పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనుంది. టికెట్ నిరాకరిస్తున్నట్టు చెప్పేది లేదు.. బుజ్జగింపులు లేవు.. ఏమీ లేవు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. రేపు మంచి రోజు కాబట్టి సీఎం కేసీఆర్ జాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితాలకు ఉద్యమకారుల (యూటీ బ్యాచ్)కు నో ఛాన్స్. బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ బ్యాచ్)కే టికెట్లన్నీ తేలిపోయింది. చాలా మంది ఉద్యమకారులు ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నారు. తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. నిజానికి 2014లో పెద్ద ఎత్తున యూటీ బ్యాచ్‌కు టికెట్లు ఇవ్వడం జరిగింది. వారిలో కొద్ది మంది మినహా అంతా ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బంగారు తెలంగాణ పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి అప్పటి టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పటికీ వారిదే హవా. వారికే సీట్లు. ఉద్యమకారులకు ఎలాంటి పదవులూ లేవు.
సిట్టింగ్‌లకే పట్టం కడతామని చెప్పి.. ఆపై గెలుపు గుర్రాలకే టికెట్ అన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు హ్యాండ్ ఇచ్చి ఈసారి కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అధిష్టానం బరిలోకి దింపనుంది.కల్వకుర్తి, ఖానాపూర్, ఉప్పల్, జనగాం, వైరా, సాగర్, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కే పరిస్థితి లేదు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీఫాం ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్‌లో గొడవ. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఈ పార్టీ పార్టీ కీలక నేతలను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మరి వీటి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.