ఇప్పటి వరకూ అంటే గత ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన వైసీపీలోకి మారిపోయారు. అయితే అక్కడి ప్రజానీకం వల్లభనేని వంశీని చూసి ఓట్లేశారా? లేదంటే ఆయన టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు కాబట్టి జనం ఆదరిస్తున్నారా? అనేది సందేహంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో జనం వల్లభనేని వంశీతో పాటు వైసీపీని చావుదెబ్బ కొట్టారు. టీడీపీకి యార్లగడ్డ వెంకట్రావు కూడా అండగా నిలిచారు. అంతే వల్లభనేని వంశీ పని ఖల్లాస్.. ఒక చిన్న వార్డు అంటే కేవలం 825 మాత్రమే ఓట్లు ఉన్న వార్డు కోసం వైసీపీ లక్షలు ఖర్చు చేసింది. అయినా ఫలితం దక్కలేదు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కానీ ఎవరి సత్తా ఏంటనేది తెలియదు అనుకున్నాం కానీ అప్పటి వరకూ ఆగాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఇచ్చేశారు. నిజానికి వల్లభనేని వంశీని చూసుకుని జబ్బలు చరుచుకుంటున్న వైసీపీకి ఇది ఊహించని షాకే.ఏపీలో పలుచోట్ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారు. తమకు తిరుగులేదు అనుకున్న చోటల్లా వైసీపీ దెబ్బతిన్నది. నిజానికి ఇలాంటి పంచాయతీ ఎన్నికలు అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకే ఫేవర్‌గా వస్తాయి. కానీ సీన్ రివర్స్. అంటే ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఎంత ఉందనేది సుస్పష్టం.
కొన్ని నెలల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.ఇవన్నీ ఒక ఎత్తయితే టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరిన, మద్దతిచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతుదారులే గెలిచారు. దీనిని బట్టి ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వల్లభనేని వంశీకి అయితే దిమ్మతిరిగే షాక్ ఇది. మేజర్ పంచాయతీ అయిన ‘నున్న’లో వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి ఇది వైసీపీకి అడ్డా. ఇప్పుడు టీడీపీ పాగా వేసింది. నిజానికి తెలుగు తమ్ముళ్లకు ఈ ఎన్నికలు మాటల్లో చెప్పలేనంత బలాన్నిచ్చాయి. మరీ ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే విజయమన్న సంకేతాన్నిచ్చాయని జనంలో చర్చ నడుస్తోంది.