ఎన్నికలు వచ్చేస్తున్నాయ్. ఇక పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలంతా మరో పార్టీలోకి మారడం సర్వసాధారణం. ముఖ్యంగా ఏపీలో మాత్రం వలసలు ఎక్కువగా టీడీపీలోకే జరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు సీన్‌లోకి గన్నవరం వచ్చి చేరింది. ఇక్కడ గత కొద్ది రోజులుగా వైసీపీ కీలక నేత జంపింగ్‌కి సిద్ధమై కూర్చొన్నారు. నిన్నటికి నిన్న తన అనుచరులతో ఫైనల్ మీటింగ్ సైతం నిర్వహించారు. ఆయన మరెవరో కాదు.. యార్లగడ్డ వెంకట్రావ్. వల్లభనేని వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికది క్లైమాక్స్‌కు వచ్చింది. ఇక తాను టీడీపీలో చేరాలని యార్లగడ్డ ఫిక్స్ అయిపోయారు.
వంశీకి వైసీపీ సీటు ఫిక్స్ అవడంతో యార్లగడ్డ జీర్ణించుకోలేకపోయారు. ఎప్పటి నుంచో పార్టీకి అండదండగా ఉంటూ గన్నవరంలో పార్టీని బతికించిన నేతను పక్కన పడేసి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తామంటే ఎవరికైనా కష్టమే కదా. పార్టీ లెక్కలు మరోలా ఉన్నాయి. గన్నవరం వంశీకి బాగా ఫాలోయింగ్ ఉన్న నియోజకవర్గం. ఇద్దరినీ కంపేర్ చేస్తే పార్టీకి ఏది లాభం చేకూరుతుందో అదే చేస్తారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. పార్టీకి ఎవరు అండగా ఉన్నారు.. ఏంటి అంటూ లెక్కలేసుకుంటూ పోతే.. అసలే కష్టంలో ఉన్న వైసీపీకి మరింత నష్టం చేకూరుతుంది. మరోవైపు తడిగుడ్డతో తన గొంతు కోశారని ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచి జగన్‌ను అసెంబ్లీలో కలుసుకుంటానని యార్లగడ్డ శపథం చేశారు.
అయితే ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? లేదంటే టీడీపీలోకి వెళతారా? అనేది తొలుత సందేహంగా మారింది. వంశీకి ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ముందు ఈ నియోజకవర్గం ఒక రకంగా టీడీపీకి కంచుకోట. వంశీ, టీడీపీని ఒక త్రాచులో పెడితే ఎవరు ఎక్కువ తూగుతారనేది చెప్పడం కష్టం. కాబట్టి.. టీడీపీకి ఉన్న ఫాలోయింగ్‌తో పాటు తనకు సొంతంగా ఉన్న ఫాలోయింగ్‌ను కలుపుకుంటే విజయం సునాయసం. జగన్ లెక్కలు జగన్‌కు ఉన్నట్టే యార్లగడ్డ లెక్కలు ఆయనకు ఉంటాయిగా.. కాబట్టి టీడీపీలోకి యార్లగడ్డ వెళ్లడం ఖాయమనే టాక్ నడుస్తోంది. వెళితేనే తన శపథం నెరవురుతుంది కాబట్టి ఆయన ఇదే నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తోంది.
వైసీపీలో యార్లగడ్డకు అడుగుడుగునా అవమానాలే. వంశీ వైసీపీలో చేరిన తర్వాత ఆయన ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి లాగేశారు. వైసీపీ సీటు వంశీకి ఫిక్స్ చేశారు. చివరకు తనకు సీటు ఇవ్వండి మహాప్రభో అన్నా కూడా కనికరించలేదు. ఇది చాలదన్నట్టు.. ఇటీవల విజయవాడకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి.. అసలు యార్లగడ్డ పార్టీలో ఉన్నా లేకున్నా ఒరిగే నష్టమేమీ లేదని.. ఉండాలో పోవాలో ఆయనే డిసైడ్ చేసుకోవాలని అన్నారు. ఇక ఇంత అవమానం జరిగాక యార్లగడ్డ ఆగుతారా? పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు. ఒకట్రెండు రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో ఉంది. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహించాలని టీడీపీ భావి్తోంది. ఈ సభలోనే యార్లగడ్డ టీడీపీలో జాయిన్ అవబోతున్నారు. ఈసారి గన్నవరం పోరు ఇంట్రస్టింగ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ టీడీపీని చూసి వంశీకి ఓట్లేశారా? లేదంటే వంశీని చూసి టీడీపీకి ఓట్లేశారా? అనేది తేలుతుంది.