ఎప్పుడైనా.. ఎక్కడైనా స్వామి భక్తి అదుపులో ఉండాలి. అది మితి మీరితే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిలా తయారవుతారు. ఏపీ సీఎం జగన్‌పై భక్తి పోసానికి మితిమీరింది. విమర్శించాలి.. తప్పులేదు. రాజకీయాల్లో అది సర్వసాధారణం కూడా కానీ శృతి మించకూడదు. మైక్ దొరికిందా కదా అని షర్ట్ లాగేసుకుంటూ ఊగిపోకూడదు. పోసాని మీడియా ముందుకు వచ్చారో చేసే పని ఇదే. వెరసి.. ఆయనపై పరువు నష్టం దావా పడిపోయింది. ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటానికి దిగారు. తెగించిన వాడికి తెడ్డే లింగమని నారా లోకేష్ న్యాయపోరాటానికి దిగారు.
తాజాగా పోసాని కృష్ణ మురళితో పాటు సింగళూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తిపై నారా లోకేష్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ నేడు మంగళగిరి కోర్టు హాజరుకానున్నారు. దీంతో ఒక్కరోజు పాటు యువగళం పాదయాత్రకు బ్రేక్ తీసుకోనున్నారు. ఇటీవల పోసాని కృష్ణ మురళి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నారా లోకేష్‌లో కంతేరులో 14 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. ఇది మాత్రమే కాకుండా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అయితే తనకు కంతేరులో ఎకరం కూడా భూమి లేదని నారా లోకేష్ తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పోసానికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ లాయర్ ద్వారా నోటీసులు పంపారు. కానీ పోసాని నుంచి నో రియాక్షన్.
మొత్తానికి నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఇక సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తిపై కూడా నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. శాంతి ప్రసాద్ సైతం నారా లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఏజెన్సీ నుంచి లోకేష్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తన స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని శాంతి ప్రసాద్ తెలిపారు. ఈ క్రమంలోనే శాంతి ప్రసాద్‌కు సైతం నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలని లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఈయన కూడా నో రియాక్షన్. క్షమాపణ చెప్పకపోవడంతో లోకేష్ కోర్టును ఆశ్రయించారు.