టీడీపీ అధినేత చంద్రబాబు ఊచకోత కోస్తున్నారు. అధికార పక్షాన్ని ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ కొడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కీలెరిగి వాత పెడుతున్నారు. ఇప్పటికే సగం మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లో భరోసాను నింపిన చంద్రబాబు.. తాజాగా మరో ప్రకటన చేశారు. ఇక ఈ ప్రకటనతో ఆయన రైతుల గుండెల్లో తిష్ట వేసి కూర్చొన్నట్టే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే 24 గంటలూ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. అంతేనా? మీ గ్రామంలోనే విద్యుత్ తయారుచేసి ఇక్కడే ఇస్తామని చెప్పారు. నిజంగా ఈ న్యూస్ రైతులకు ఆత్రేయపురం పూతరేకు మాదిరిగా స్వీటుగా అనిపించి ఉంటుంది. అధికారపక్షానికి మాత్రం గుంటూరు కారం మాదిరిగా ఘాటుగా అనిపించడం ఖాయం.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి మండపేట కలువపువ్వు సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు రైతులకు 24 గంటలూ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. ఇది విన్న రైతులు.. మీరు మారిపోయారు సర్ అని అనుకోవడం ఖాయం. ఎందుకంటే.. దెబ్బ పడితే కానీ.. తత్వం బోధపడలేదు అన్నట్టుగా ఒకసారి దెబ్బ పడితే కానీ చంద్రబాబుకు రైతుల విలువ తెలిసి రాలేదు. ఒకప్పుడు వ్యవసాయం దండుగ అన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరవేసుకుంటారన్నారు. అప్పట్లో ఈ విషయాన్ని ప్రతిపక్షాలు హైలైట్ చేశాయి. దెబ్బకు చంద్రబాబు పీఠం కదిలింది.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు లేరు. చాలా మారిపోయారు. ఇప్పుడు రైట్ ట్రాక్‌లోకి వచ్చారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడున్నది చంద్రబాబు 2.0. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికీ చేరువయ్యే యోచనలు చేస్తున్నారు. అధికారపక్షంపై అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడా కూడా భయపడటం లేదు. వెనుకడుగు వేస్తున్నది లేదు. దీనికి పుంగనూరు ఘటనే నిదర్శనం. ఇప్పటికే చంద్రబాబును ఏపీ ప్రజానీకం అక్కున చేర్చుకుంటోంది. ఇలాంటి ఉపయోగకరమైన వరాలు ఆయన్ను మరింత జనానికి చేరువ చేస్తాయి. ఈ క్రమంలోనే ఆయన సంక్షేమ పథకాల విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తే బాగుంటుంది. నిరుపయోగమైన వాగ్దానాలు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే.. అధికారంలోకి అయితే వస్తారేమో కానీ ఆ తరువాత ఆ వాగ్దానాలే ఉరితాళ్లవుతాయి.