విశాఖ నగరం గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కుటుంబాలతో సహా ఆందోళనలో పాల్గొన్నారు. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. విషయం ముందుగానే తెలియడంతో పోర్టు వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. పోర్టు గేటుకు ఇరువైపులా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.
ఆందోళనకారులను గంగవరం పోర్టు ప్రధాన ద్వారానికి 100 కిలో మీటర్ల వెలుపలే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా గంగవరం పోర్టు వద్ద కార్మికులకు పోలీసులకి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులను తోసుకుని పోర్టు లోపలకు వెళ్లేందుకు కార్మికులు యత్నించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన తోపులాటలో10 మంది పోలీసులు గాయపడగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు గాజువాక సీఐకి కాలిలో ముళ్ల కంచె దిగింది. ఆందోళనలో పాల్గొన్న పలువురు మహిళలు సొమ్మిసిల్లి పడిపోయారు.
45 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా కూడ గంగవరం పోర్టు యాజమాన్యం నుండి స్పందన లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు.