ఏపీ రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఉత్తరాంధ్రపై ముందుగా పట్టు సాధించాలి. అక్కడ పట్టు సాధించిన పార్టీయే దాదాపు ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అందుకే ఏపీ సీఎం జగన్.. విశాఖను రాజధానిని చేస్తానంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను విశాఖలోనే నివాసమేర్పాటు చేసుకుంటానంటారు. నిజానికి ఉత్తరాంధ్ర అనేది ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఈ కంచుకోట కుప్పకూలింది. ఈ పునాదులపై వైసీపీ తన సరికొత్త కంచుకోటను నిర్మించుకుంది. కానీ ఎందుకో అది ఈ ఐదేళ్లకే పరిమితమేమో అనిపిస్తోంది. దీనికి కారణాలు కోకొల్లలు.
విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ద్వారా విశాఖ ఉత్తరాంధ్రలో రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు జగన్. కానీ అంతర్గత విభేదాలు.. ఆపై విజయసాయిరెడ్డిని కొంతకాలం పాటు దూరంగా పెట్టడం వంటివి ఆ పార్టీకి ఏమాత్రం కలిసిరాలేదు. చిన్నచిన్నగా రాజకీయ సౌధం బీటలు వారడం ప్రారంభమైంది. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే.. వైసీపీ ఎంపీ తనకేమీ పట్టనట్టు ఢిల్లీలో కూర్చొన్నారు. అంతే.. పార్టీ దెబ్బకు బొక్కబోర్లా పడింది. ఉత్తరాంధ్రలో పార్టీ పతనం ప్రారంభమైందనే టాక్ అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు విజయసాయిని దగ్గరకు తీసినా కూడా ఏం ప్రయోజనం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక వైసీపీపై ఏర్పడిన వ్యతిరేకతను టీడీపీ, జనసేనలు తమకు అనుకూలంగా మార్చుకోవడంపై ఫోకస్ పెట్టారు. వైసీపీ కూడా తాము చేసిన అభివృద్ధిని ఊటంకిస్తూ.. తిరిగి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇక ఈ రేస్‌లో అయితే చంద్రబాబు ముందున్నారు. ఏ రాష్ట్రానికైనా.. జిల్లాకైనా కావల్సింది నీళ్లు, నిధులు, నియామకాలు. అసలు ఈ మూడింటి పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర ఎంత? తన హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. నియామకాల విషయంలో భరోసా ఇస్తున్నారు. అలాగే జగన్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సక్సెస్. ఇది ఇలాగే ఉంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తిరిగి టీడీపీ పాగా వేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.