చాలామంది హీరోలు సినిమా ప్లాప్ అవ్వగానే అంతా దర్శకులదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. హీరోలు కథ విన్నాకే దర్శకుడు తన పని మొదలు పెడతాడు. కానీ సినిమా ప్లాప్ అయితే తాము నటిస్తాము తప్ప మాకు ఆ డైరెక్షన్‌తో సంబంధం లేదు అన్నట్టుగా తప్పించుకుంటారు. అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతుంది.. వినబడుతుంది. సినిమా రిజల్ట్‌లో తేడా వస్తే అది దర్శకుల తప్పు, హిట్ రిజల్ట్ వస్తే అది హీరోల క్రెడిట్ అన్నట్టుగా తయారైంది.
కానీ హీరో కేవలం నటించేస్తే ఓకే.. అలా కాకుండా సినిమా డైరెక్షన్‌లో, స్క్రిప్ట్‌లో, ఎడిటింగ్‌లో కాళ్ళు, వేళ్ళు పెడతారు. తర్వాత నాకేమి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ఎవరికీ కనిపించని విషయం. హీరోల మీద కామెంట్స్ చేస్తే కెరీర్‌లు ఏమవుతాయో అనే భయంతో వాటిని బయటికి రానివ్వరు. ఫైనల్‌గా సినిమాల రిజల్ట్స్ విషయంలో దర్శకులే టార్గెట్ అవుతున్నారు. నిర్మాతలు నష్టపోతున్నారు. వాళ్ళు ఎంత పోగొట్టుకున్నా వారు బాధని, ఆవేదనని బయట పెట్టకూడదు.. పెడితే మళ్లీ ఆ హీరో మరో అవకాశం కూడా ఇవ్వడు, అలా జరిగితే చివరికి ఆ నిర్మాతలు కనుమరుగైపోతారు.
కథ విన్నప్పుడు ఆ కథ ప్రేక్షకులకి నచ్చుతుందా.. ఈ జనరేషన్‌కి ఇది వర్కౌట్ అవుతుందా అనే అవగాహన హీరోలకి ఉంటుంది. కథ విన్నప్పుడు బావుంది.. సినిమా తెరకెక్కినప్పుడు బాలేదు అంటే.. ప్రతి సీన్‌లో హీరో ఉంటాడు. ఆ రషెస్ చూస్తాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. కానీ రిజల్ట్ విషయంలో మాత్రం తనకి సంబంధం లేదు అంటాడు.. ఇదెక్కడి న్యాయమో కదా!