సంచలన దర్శకుడు శంకర్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో ఓవైపు ఇండియన్ 2 చేస్తూనే మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. ప్రస్తుత తరుణంలో మరే అగ్ర దర్శకుడూ చేయలేక పోతున్నట్టుగా ఏక కాలంలో ఆ రెండు భారీ చిత్రాల షూటింగ్ నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
అయితే ఆయా సినిమాల అప్ డేట్స్ విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోన్న శంకర్ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా RRR తరువాత రామ్ చరణ్ చేస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా ఫిలిం అప్ డేట్స్ కోసం ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.. సోషల్ మీడియాలో వెర్రెక్కిపోతున్నారు. ఎపుడో రామ్ చరణ్ బర్త్ డేకి రిలీజ్ చేసిన ఓ పోస్టర్ తప్ప మరే అధికారిక న్యూస్ ఇవ్వని మేకర్స్ నుంచి ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా తప్పక తమని ఉత్సాహపరిచే అప్ డేట్ వస్తుందని ఆశించారు. అదైతే వచ్చింది కానీ అక్కడా ఒక ట్విస్ట్ ఇచ్చారు శంకర్.
అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రెండు వరుస ట్వీట్స్ వేసిన శంకర్ ఇండియన్ 2 పోస్టర్ లో కమల్ హాసన్ లుక్ చూపించి సర్ ప్రైజ్ చేసారు కానీ... గేమ్ చేంజర్ ట్వీట్ కి మాత్రం వెనుక మహాత్మా గాంధీ పోస్టర్ ఉండగా ముందు సీన్ పేపర్ పట్టుకుని తాను మాత్రమే కనిపించే వర్కింగ్ స్టిల్ తో సరిపెట్టేసారు. దాంతో చరణ్ అభిమానులు మళ్ళీ ఉసూరుమంటూ మరో రెండు రోజుల్లో దర్శకుడు శంకర్ పుట్టినరోజు ఉంది... అలాగే సరిగ్గా వారం రోజుల్లో ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రాబోతోంది కనుక ఆ సందర్భంగా అయినా గేమ్ చేంజర్ స్పెషల్ డిజైన్స్ వదులుతారేమో అనే ఆశలతో వేచి చూస్తున్నారు.