ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగింది శూన్యం. కేవలం సంక్షేమ పథకాలకు డబ్బు వెచ్చించి కొందరిని సోమరపోతుల్ని చేయడం తప్ప ఏపీ సీఎం జగన్ సాధించిందేమీ లేదు. ఇటీవలి కాలంలో ఒక ప్రాజెక్టు ఏపీకి వచ్చింది లేదు. పైగా వచ్చిన ప్రాజెక్టుల్ని నిలుపుకున్నది లేదు. రిషికొండ హారతి కర్పూరంలా కరిగిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతోంది. రోడ్లు చూస్తే అడుగుకో గుంత. పోనీలే రాజధాని ఇది అని చెప్పుకుందామా? అంటే అందుకూ ఆస్కారం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. ఇలాంటి తరుణంలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు వంటి కార్యక్రమాలు ఎన్నింటినో జగన్ ప్రభుత్వం చేపట్టింది. కానీ పథకాలకు పేర్లు పెట్టేస్తే సరిపోతుందా? జనం మనసులో తమ నమ్మకం జగనే అన్నది స్ట్రాంగ్‌గా నాటుకోవాలి కదా? మరి ఏ భరోసాతో ఆయన తమ నమ్మకం, భవిష్యత్తని అనుకుంటారు? ఈ రోజుల్లో ఎవరికి పెద్దగా ఓపిక ఉండటం లేదు. పెళ్లయినా.. ఇల్లు కట్టడమైనా కాంట్రాక్ట్ ఇచ్చి పడేసి చేతులు దులుపుకుంటున్నారు. రాజకీయాల్లో సైతం జగన్ ఇదే ట్రెండ్‌ను అవలంబిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే కాంట్రాక్టును ఐ ప్యాక్ టీంకు అప్పగించేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ టీమ్ ఆడమన్నట్టల్లా ఆడుతున్నారు.
ఈ క్రమంలో చేపడుతున్నవే.. పై కార్యక్రమాలన్నీ. ఇక తాజాగా మరో కార్యక్రమం. ‘జగనన్నకు చెపుదాం’. నాలుగేళ్లుగా పరిష్కారం కానీ పనులను మంత్రం దండం వేసి హాం ఫట్ అనేసి తీర్చేస్తామన్నట్టుగా చెప్పారు. మరి అయ్యే పనేనా? వెరసి బ్లేమ్ అయిపోయారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అభాసు పాలైతే తమ గొయ్యి తాము తవ్వుకోవడం కాదా? ఇక ఇవన్నీ చాలవన్నట్టు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అట.. నవ్విపోదురుగాక. అధికార పక్షమే వెళ్లి ‘వై ఏపీ నీడ్స్ జగన్’? అని ప్రశ్నిస్తే ప్రజలు నో నీడ్ అంటే తలలు ఎక్కడ పెట్టుకుంటారు? పైగా విపక్షాలకు మంచి అస్త్రమే ఈ కార్యక్రమం ద్వారా జగన్ అందిస్తున్నారు. ఇంతటి పనికిమాలిన సీఎం మనకెందుకని విపక్షాలు ఇదే కార్యక్రమాన్ని రివర్స్ వేలో వినియోగించుకుంటే.. బొక్క బోర్లా పడినట్టే.