టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నిజానికి ఈ యంగ్ అండ్ డైనమిక్‌ని యువగళం పాదయాత్రకు ముందు.. ఆ తరువాతగా చూడాలి. అంతకు ముందు అంతో ఇంతో తడబడిన లోకేష్ ఇప్పుడు కనిపించడం లేదు. ఎంతటి విమర్శకులకైనా ధీటుగా సమాధానం చెప్పేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు వెన్నుదన్నుగా మారిపోయారు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా వెన్ను చూపడం లేదు. ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా పాదయాత్రను ఆపడం లేదు. జనం కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ సభ జరిగినా ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ తన వ్యూహం మార్చేశారని తెలుస్తోంది.
యువగళం పాదయాత్ర షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేశారట. అనుకున్నదాని కంటే ముందుగానే పాదయాత్రను ముగించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇంకా పాదయాత్ర నిర్వహిస్తూ పోతే కష్టమని భావించిన నారా లోకేష్ తన వ్యూహాన్ని మార్చబోతున్నారట. ముందుగా అనుకున్న ప్రకారం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ లెక్కన చూసుకుంటే నారా లోకేష్ పాదయాత్ర మార్చి 1కి ముగుస్తుంది. ఈ లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రకటన వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఆ సమయానికి పాదయాత్ర చేస్తూ ఉంటే అభ్యర్థుల కసరత్తు వంటి అంశాలపై దృష్టి సారించడం కష్టం కాబట్టి నారా లోకేష్ తన పాదయాత్ర షెడ్యూల్‌ను మార్చబోతున్నారట. రోజులు తగ్గించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నవంబర్ నాటికి పాదయాత్రను ముగించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. తొలుత 400 రోజులకు గానూ.. 10 కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేయాలని భావించారు. కానీ ఇప్పుడు రోజుకు 15 కిలో మీటర్లు పాదయాత్ర సాగించాలనుకుంటున్నారట. మొత్తానికి నవంబర్ చివరి నాటికి పాదయాత్రను ముగించేలా రూట్ మ్యాప్‌ను అధిష్టానం సిద్ధం చేస్తోందట. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో కొత్త నారా లోకేష్‌ను చూడటమైతే ఖాయం.