కొందరు ఏం చెప్పినా ఊరికే నమ్మేస్తారు. కొందరు ఏం చెప్పినా.. అసలు నమ్మలేం. రెండో జాబితాలోకి విశ్వక్‌సేన్ వంటి.. వంటి ఏంటి? విశ్వక్‌సేనే వస్తాడు. ఎందుకంటే.. ఆయన నిజం చెప్పినా కూడా నమ్మలేని విధంగా ఆయన పబ్లిసిటీ స్టంట్స్ ఉంటాయి. ఆమధ్య రోడ్డు మీద ఆయన వేసిన వీరంగం అలాంటిది మరి. తాజాగా ఆయన ఓ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూస్తుంటే ఆయన పెళ్లికి సిద్ధమైనట్లే అనిపిస్తుంది. కానీ నమ్మేదెలా? ఎందుకంటే ఇది కూడా తన తర్వాత సినిమాకు సంబంధించి పబ్లిసిటీ స్టంటేమో? ఏమో ఏదైనా అయి ఉండవచ్చు. ఇదెలా ఉందంటే.. నాన్నోయ్ పులి స్టోరీలా ఉంటుంది. విశ్వక్ నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితన్నమాట.
విశ్వక్‌సేన్ విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే.. ‘నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు.. మీరు ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమకు, నాకిచ్చిన మద్దతుకు కృతజ్ఞుడిని. ఇప్పుడు నా జీవితంలో మరో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఫ్యామిలీ మొదలుపెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే చెబుతాను’ అని తెలుపుతూ ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఆగస్ట్ 15న అసలు విషయం తెలియజేస్తానని విశ్వక్‌సేన్ తెలియజేశాడు. ఈ ప్రకటన చూసిన ఎవరైనా సరే.. విశ్వక్‌సేన్ పెళ్లి చేసుకోబోతున్నాడనే అనుకుంటారు. అందులో డౌటే లేదు. కానీ, ఆ విషయం విశ్వక్‌సేన్ అధికారికంగా చెప్పే వరకు.. ఇది పెళ్లి వార్తే అనుకోవడానికీ లేదు.
అయితే ఈ ప్రకటనకు మాత్రం నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తుండటం విశేషం. ఇదేదో కొత్త సినిమా ప్రచారం కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అనుకుంటా అని కొందరు, పెళ్లేనా.. అమ్మాయి ఎవరు? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే విశ్వక్‌సేన్ ఏదో చెప్పబోతున్నాడనే విషయం అయితే అర్థమవుతోంది. ప్రస్తుతం విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాతో ఓ వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో నేహా శెట్టి, అంజలి వంటి వారు నటిస్తున్నారు. ఇక విశ్వక్‌సేన్ చెప్పే ఆ విషయం ఏమిటనేది ముందే తెలుసుకోవాలనే ఆతృతతో తలలు బాదుకోవడం మానేసి.. అసలాయన ఆగస్ట్ 15న ఏం చెబుతాడో అనేది చూద్దాం..