సూపర్ స్టార్ రజనీకాంత్‌కి హిట్ సినిమా పడి చాలా కాలం అవుతుంది. ఆయన వయసును పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు కానీ.. సరైన విజయం మాత్రం ఆ సినిమాలు పొందలేకపోతున్నాయి. అయినా కూడా ఆ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనేదానికి ఉదాహరణ తాజాగా వచ్చిన ‘జైలర్’ చిత్రమే. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా విజయ ఢంకా మోగిస్తోంది. గురువారమే ఈ సినిమా విడుదలవడం.. మరింతగా కలిసొచ్చింది. ఆ తర్వాత రోజు విడుదలైన ‘భోళా శంకర్’ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రేక్షకులు జైలర్‌కే ఎగబడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్‌ని సాధించినట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలకు ముందే రజనీకాంత్ హిమాలయాల బాట పట్టారు. ఇది రజనీకాంత్‌కి కొత్తేం కాదు. ఆయన ఎప్పుడూ హిమాలయాలకు వెళుతూనే ఉంటారు. ధ్యానం చేస్తూనే ఉంటారు. ఈసారి కూడా బద్రీనాథ్, రిషికేశ్ వంటి పుణ్య స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి దయానంద గురూజీ ఆశ్రమంలో రజనీకాంత్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రజనీకాంత్ తన జైలర్ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం.
భారీ అంచనాల నడుమ జైలర్ సినిమా విడుదలైంది. కంగారుపడొద్దు.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని స్వామీజీ చెప్పారు. ఆయనే స్వయంగా ఆ మాట చెప్పిన తర్వాత ఇంక భయం ఎందుకు.. జైలర్ హిట్ అయినట్టే అని నేను అనుకున్నాను.. అంటూ రజనీ ఈ వీడియోలో చెప్పారు. స్వామిజీ, రజనీ.. చెప్పినా, చెప్పకపోయినా.. జైలర్ నిజంగానే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది. సోమవారం, మంగళవారం కూడా స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు కలిసి రావడంతో.. జైలర్‌కు మరింత ప్లస్ అయ్యే ఛాన్సుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.