సమీరా రెడ్డి.. ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదేమోగానీ.. చిరు, ఎన్టీఆర్ ఒకరి ఒకరు పోటీ పడుతున్న సమయంలో సమీరా మాంచి డిమాండ్ మీదుంది. చిరుతో ‘జై చిరంజీవ’, ఎన్టీఆర్‌తో ఓ రెండు, మూడు సినిమాలు చేసింది సమీరా రెడ్డి. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లి కూడా అయింది. సినిమాలు వదిలేసిన తర్వాత అంతగా ఫోకస్ కానీ సమీరా రెడ్డి.. పెళ్లి, పిల్లల బాధ్యత అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తాజాగా ఆమె తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఎన్ని విమర్శలను దాటుకుని వచ్చిందో తెలియజేసే ప్రయత్నం చేసింది.
2014లో నాకు అక్షయ్‌తో పెళ్లి జరిగింది. నేను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని.. అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని అప్పట్లో కొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ అది వాస్తవం కాదు. మేము మా పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నాం. మా వివాహం సింపుల్‌గా మా ఇంటి టెర్రస్‌పైనే జరిగింది. పెళ్లి తర్వాత తొలి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేశాను. ఫస్ట్ సంతానం తర్వాత బరువు బాగా పెరిగానని, బాగా లావు అయ్యానని అంతా విమర్శించారు. ఆఖరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా నాపై కామెంట్స్ చేశాడు.
ఏమైంది అమ్మగారు? మీరేనా? అంటూ కూరగాయలు అమ్మే వ్యక్తి, మా ఇంటి చుట్టు పక్కల ఉన్నవారు కూడా నా శరీరంపై కామెంట్స్ చేసేవారు. వీళ్లందరికీ భయపడి బయటికి రావడం కూడా మానేశాను. అసలు ఫొటోగ్రాఫర్స్‌కి కనపించకుండా ఇంటికే పరిమితమయ్యాను. కానీ, నా అభిమానులను కలుసుకోవడానికి మాత్రం సోషల్ మీడియా బాట పట్టాను. ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి.. అందరికీ రిక్వెస్ట్ పెట్టి సపోర్ట్ చేయమని కోరాను. కానీ తెలిసిన వారెవరూ సాయం చేయలేదు. అభిమానులే అండగా నిలబడ్డారు.. అందుకే వారి కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటానని సమీరా చెప్పుకొచ్చింది.