టైటిల్ చూసి భయపడుతున్నారా? భయపడవద్దు. మెహర్ రమేష్‌కు మళ్లీ ఛాన్స్ ఇచ్చెదెవరు? అనేది అసలు టైటిల్. అక్కడ స్పేస్ సరిపోక అలా షార్ట్‌గా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇక విషయంలోకి వస్తే.. మెహర్ రమేష్ అంటే చాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ భయపడే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇస్తే.. ఫ్యాన్సే ఫైర్ అయ్యేలా భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగు రీమేక్స్‌తో ఆయన కన్నడలో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు.. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం హిట్ అనే పదమే మెహర్‌కి దూరమైంది.
కంత్రీ, బిల్లా, శక్తి, షాడో.. ఇప్పుడు భోళా శంకర్.. వీటిలో ఏ ఒక్కటీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వీటిలో బిల్లా కాస్త పర్లేదు అని మాత్రం అనిపించుకుంది. అయినా చిరంజీవిని డైరెక్ట్ చేయడం డ్రీమ్ అని ఎన్నో సందర్భాలలో చెప్పిన మెహర్.. వింటేజ్ వింటేజ్ అంటూ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా సినిమాని తెరకెక్కిస్తే ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందని అనుకున్నాడో. 10 ఏళ్లలో చాలా అప్‌డేట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రేక్షకులు ఓటీటీ రూపంలో కొత్త కొత్త కంటెంట్‌ని వీక్షిస్తూ.. అప్‌డేట్ అయ్యారు. కానీ మెహర్ మాత్రం ఎక్కడ ఆగిపోయాడో.. అక్కడే ఉండిపోయాడు. ఒక అభిమానిగా కసిగా చేయాల్సిన సినిమాని.. కంగాళీ చేసేశాడు. దీంతో థియేటర్లు ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్.. వంటి తారాగణాన్ని ఇచ్చినా.. నేనేం చూసి అభిమాని అయ్యానో.. అదే చూపిస్తానంటూ ఫిక్సయిపోయిన మెహర్ రమేష్.. ఓ అవుట్ డేటెట్ సినిమాని ప్రేక్షకుల ముందు దించాడు. సరే సినిమా నచ్చితే చూస్తారు.. లేదంటే ఓటీటీలో చూసుకుంటారు అది వేరే విషయం. కానీ ఇప్పుడు మెహర్ పరిస్థితి ఏంటి? అన్నయ్యతో సినిమా తీశా.. ఇక చాలు అని ఆపేస్తాడా? లేక మళ్లీ ప్రయత్నాలు మొదలెడతాడా? మళ్లీ ప్రయత్నిస్తే.. ఈసారి ఛాన్స్ ఇచ్చెదెవరు? 12 ఏళ్లకి ఒకసారి పుష్కరాల మాదిరిగా.. మళ్లీ ఓ 10 ఏళ్ల తర్వాత ఎవరో ఒకరు దొరక్కపోతారా? అని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే కాలాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావాలంటే ఇలాంటి దర్శకుల అవసరం ఎంతైనా ఉంటుంది మరి.