ఇకపై చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల గురించి ప్రస్తావించనంటూ ఆ మధ్య వర్మ శపథం చేసిన రామ్ గోపాల్ వర్మ.. మళ్లీ మాట తప్పి నోటికి పని కల్పించారు. అందుకు కారణం మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రమే. ఈ సినిమా శుక్రవారం విడుదలై మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ నెగిటివ్ టాక్‌కి ప్రధాన కారణం.. సినిమాలో కామెడీ.. కామెడీగా ఉండటమే. దీనికోసం దాదాపు జబర్దస్త్ టీమ్‌ని దించేయడంతో.. సినిమా చూసిన వారంతా.. జజర్దస్త్ స్కిట్ ఉన్నట్లు ఉంది అనేలా సినిమాపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది స్పీచ్.. భజనలా అనిపించిందంటూ అప్పుడే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు సినిమా విడుదల తర్వాత.. ముందు ఆ భజన బ్యాచ్‌ని చిరు పక్కన పెట్టాలంటూ అంతా సలహాలు ఇస్తున్నారు. వర్మ కూడా సోషల్ మీడియా వేదికగా చిరుకి ఇలాంటి ఉచిత సలహానే ఒకటి ట్వీటాడు.
‘జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు.. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే. వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో, ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్’ అంటూ వర్మ తన ట్విట్టర్‌లో ట్వీటాడు.
వర్మ ట్వీట్‌కి కొందరు నెటిజన్లు వంత పాడుతుంటే.. మరికొందరు మాత్రం.. ఛీ ఛీ వర్మలాంటి వాడి నోరు కూడా పనిచేసేలా చేసింది భోళా శంకర్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతే కాదు, వైఎస్ జగన్‌కి కూడా ఇలాంటి ఉచిత సలహా ఒకటి ఇవ్వమంటూ వర్మకి సలహాలు ఇస్తున్నారు. జగన్ చుట్టూ కూడా దాదాపు ఇలాంటి భజన బృందమే ఉంది. కాస్త చూసుకోమని చెప్పు. మెగాస్టార్‌కి సలహాలు ఇవ్వడం మానుకో.. అంటూ నెటిజన్లు కామెంట్లతో కాకరేపుతున్నారు. మొత్తంగా అయితే వర్మ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ చిరుపై కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌లో వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌కి చిరు కారణం కాదని, రవితేజానే అనేలా ఉండటం.. మెగా ఫ్యాన్స్‌కి మరింతగా కోపాన్ని తెప్పిస్తోంది.