ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ వారు 30 కోట్లు తీసుకుని మోసగించారు.. అందుకే భోళా శంకర్ సినిమాపై కోర్టులో కేసు వేశాం అంటూ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) నిన్న చాలా హడావిడి చేసారు. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు తనను నమ్మించి మోసం చేశారని సత్యనారాయణ ఆరోపించారు. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చి, 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ వారు నన్ను పచ్చిగా మోసగించారు.
సామజవరగమన వైజాగ్ హక్కులు ఇచ్చినా అది కొంతవరకే రికవరీ అయ్యింది. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం ఇచ్చారు. వారి తదుపరి సినిమా భోళా శంకర్. కానీ దాని హక్కులు ఇవ్వలేదు. అందుకే కోర్టులో వేశానని చెప్పారు. తమ డబ్బు చెల్లించేవరకు భోళా శంకర్ రేపు విడుదల కాకుండా అడ్డుకుంటామని అన్నారు.
కానీ తాజాగా భోళా శంకర్ విడుదలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది, భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసింది. గాయత్రి ఫిలిమ్స్ (సతీష్ ) పిటీషన్ డిస్మిస్ చేసిన సిటీ సివిల్ కోర్టు.. దానితో భోళా శంకర్ రేపు శుక్రవారం యధావిధిగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరికొద్దిసేపట్లో ఓవర్సీస్ లో భోళా హడావిడి మొదలు కాబోతుంది.