రేపు శుక్రవారమే భోళా శంకర్ మూవీ రిలీజ్ కాబోతుంది.. ఇటు చూస్తే ఏపీలో సిట్యువేషన్ గలీజ్ గా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వ పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ లోని వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి. దానితో ఒక్కొక్కరిగా మీడియా ముందు ప్రత్యకమై మెగాస్టార్ ని తెగ విమర్శించేస్తున్నారు వారు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యన్నారాయణ లాంటి నేతలు చిరుని విమర్శించడం కాదు.. ఏకంగా ఆయనపై సినీ ఇండస్ట్రీపై అవాకులు, చవాకులు పేలుతున్నారు.
బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పకోడీగాళ్లు, మెగాస్టార్ ఏమైనా దిగొచ్చాడా అంటూ చేసిన వ్యాఖ్యలతో మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. అటు కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో నాని మెగాస్టార్ పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా మెగా ఫాన్స్ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. చిరంజీవిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ చేశారు. చిరంజీవికి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు చిరంజీవి అభిమానుల ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, చిరంజీవి అభిమానులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో పోలీసులు చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవితో పాటు పలువురు అభిమానుల్ని అరెస్ట్ చేశారు.
రెండు రోజుల్లో భోళా శంకర్ రిలీజ్ అవుతున్న తరుణంలో ఇలాంటి గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని అటు భోళా మేకర్స్ కంగారు పడుతున్నారు.