సాయిధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిపడేసిన విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో.. కలెక్షన్స్ గురించి ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్లు మాట్లాడుతున్నారంటూ అంబటిపై ఆది పంచ్‌లు పేల్చాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. అయితే చిరు అన్నాడని కాదు కానీ.. కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండటం కారణంగా.. గత కొంతకాలంగా ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తుందో తెలియంది కాదు. నాని వంటి హీరోలు కొందరు కూడా ఈ సమస్యపై పబ్లిగ్గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా నా ఒక్కడి గురించి సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఏపీ ప్రభుత్వంలోని కొందరు పని కట్టుకుని మరీ మైకుల ముందు వాలిపోతూ.. సినిమా ఇండస్ట్రీపై విమర్శలకు దిగుతున్నారు.
రీసెంట్‌గా వైసీపీకి చెందిన ఓ ఎమ్.పి గారైతే పెద్దల సభలో కూడా హీరోల రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడి.. ట్రోలర్స్‌కి పని కల్పించాడు. ఇన్ని జరుగుతున్నా కూడా.. ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్న చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు. మరి ఏం అనుకున్నారో ఏమో, తను మాట్లాడకపోతే.. పొలిటికల్ లీడర్స్.. పూర్తిగా సినిమా ఇండస్ట్రీని ఆక్రమిస్తారనో.. లేక నాశనం చేస్తారనో భావించినట్లున్నారు. మెగాస్టార్ కూడా ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. సోమవారం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘మీరున్న పదవులకి, ప్రజలు మీకిచ్చిన స్థానానికి ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలలువంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి?’’ అని చిరు చురకలు అంటించారు చిరు. తమ్ముడు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడే.. ఒక గొంతు కలిపి ఉంటే.. ఇండస్ట్రీ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇప్పటికైనా చేతులు కట్టుకుని బతిమిలాడితే తీరే సమస్య కాదు ఇదని చిరంజీవి గమనించినందుకు.. ఇండస్ట్రీలోని చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ గురించి అయితే చెప్పేదేముంది. రెండు రోజుల్లో సినిమా రిలీజ్‌ని పెట్టుకుని కూడా చిరంజీవి ఇలా మాట్లాడారంటే.. ఆయనలో మార్పు మొదలైందనే సంకేతం కనిపిస్తుందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.