మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే పలు అంశాలకు నటుడు, కమెడియన్ హైపర్ ఆది.. ఆదివారం జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో క్లారిటీ ఇచ్చేశారు. కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే.. కొందరు మనల్ని ఏమీ అనకుండా ఉంటారు.. కాబట్టి మాట్లాడాలి అంటూ స్పీచ్ స్టార్ చేసిన ఆది.. మెగాస్టార్‌కి అవమానం జరిగినా సరే.. ఎలా క్షమిస్తారో చెప్పుకొచ్చారు. ఆది మాట్లాడుతూ..
* మెగాస్టార్ చిరంజీవిగారు ఎదగక ముందు, ఎదిగిన తర్వాత కూడా అవమానాలు జరిగాయ్. అప్పుడాయన మాట్లాడడానికి పరిస్థితులు అడ్డొచ్చాయ్.. ఇప్పుడాయన మాట్లాడడానికి సంస్కారం అడ్డొచ్చింది. అందుకే ఆయన ఎవరినీ ఎప్పుడూ ఏమీ అనలేదు. ఠాగూర్ సినిమాలో ఆయనకి నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. కానీ నిజ జీవితంలో ఆయనకి నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. చాలా మందిని చాలా రకాలుగా క్షమించేశారు. ఒకప్పుడు ఆయన రాజకీయ ప్రచారం చేస్తుంటే.. వాడెవడో చిరంజీవిగారి మీద కోడిగుడ్డు విసిరాడు. అప్పుడాయన కనుసైగ చేసి ఉంటే.. ఆ గుడ్డు కొట్టిన వాడికి అక్కడే గుండు కొట్టేవారు. క్షమించారు. ఒకప్పుడు మినిస్టర్ హోదాలో ఉండి.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళితే.. అక్కడ ఓటు ఉందా లేదా? అని తెలుసుకోవడానికి లైన్ క్రాస్ చేస్తే.. ఓ NRI.. ఈ లైన్ క్రాస్ చేసిన దానికి.. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాడు. చూసిన అందరికీ కోపం వచ్చింది.. కానీ చిరంజీవిగారికి కోపం రాలేదు. చాలా కూల్‌గా మాట్లాడారు. లైన్ క్రాస్ చేసిన విషయం తెలుసుకోకుండా అతను మాట్లాడాడు. ఒకప్పుడు ఆయన సినిమా టికెట్ల కోసం లైన్ క్రాస్ చేయడం కాదు.. తొక్కుకుంటూ, నెట్టుకుంటూ వెళ్లి మరీ టికెట్స్ తీసుకున్నాం. చొక్కా చిరిగితే సినిమా టికెట్ దొరికినట్టు.. చిరగకపోతే టికెట్ దొరకనట్టే. అది మెగాస్టార్ రేంజ్. అలాంటి వ్యక్తుల్ని క్షమించారు. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి.. కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవిగారిపై అసహనం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండా, చిరంజీవిగారికి ఏ సంబంధం లేకుండా. ఎదురుగా ఉండే వారికి ఎలా ఉండాలో నేర్పే ఆయన సహనం కోల్పోయారు కానీ.. ఆ రోజు చిరంజీవిగారు సహనం కోల్పోలేదు. వెంటనే వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారు.. ఆ సభ సజావుగా జరిగేలా చేశారు. అది మెగాస్టార్.
* కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయ్. హీరో సుమన్ గారి విషయం, హీరో ఉదయ్ కిరణ్ గారి విషయం.. ఇలాంటి సున్నితమైన విషయాలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. రాసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి వాటిని కూడా ఆయన క్షమించారు. అలా రాసేవాళ్లకి చెబుతున్నాను.. కష్టపడి సంపాదించుకోండి.. కష్టపడిన వాళ్ల మీద పడి సంపాదించుకోవాలని చూడకండి.