ఓ చిన్న సినిమా.. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బి, సి సెంటర్స్ లో ఇరగాడేసింది. నిర్మాతకి డబ్బు, దర్శకుడికి పేరు ప్రతిష్టలు, నటులకి ప్రశంశలు, గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్. అదే బేబీ మూవీ. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-విరాజ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంతో SKN నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పటికీ బేబీ మూవీ మాట సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. గత రాత్రి బేబీ సక్సెస్ పార్టీ అంటూ టీమ్ తో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు కూడా హంగామా చేసారు.
థియేటర్స్ లో ఇంత పెద్ద హిట్ అయిన బేబీ మూవీ కోసం ఓటిటీ ప్రేక్షకులు అప్ప్పుడే కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. అంటే చిన్న, పెద్ద సినిమాలు, హిట్టు, ప్లాప్ సినిమాలు ఈమధ్యన మూడు నుండి నాలుగు వారాల్లోపే ఓటిటిలో స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తున్నాయి. మరి బేబీ మూవీ కూడా అదే రకంగా ఆగష్టు 14 నుండి 18 లోపులో ఓటిటిలోకి వచ్చేస్తుంది అనుకోవడమే కాదు.. ఆగష్టు 18 న బేబీ ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా బేబీ నిర్మాత SKN బేబీ ఓటిటీ రిలీజ్ తేదీపై క్లారిటీ ఇచ్చాడు. ఆగష్టు 18 నుండి ఓటిటీ స్ట్రీమింగ్ అంటూ వస్తున్న వార్తలపై ట్విస్ట్ ఇచ్చాడు. బేబి మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. కాబట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆగస్టు 18న స్ట్రీమింగ్ అవుతుంది అన్న వార్తల్లో నిజం లేదు అంటూ ఓటిటీ ఆడియన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.