సీనియర్ హీరోయిన్ శోభన ఈమధ్యన టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ చాలా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ బాబు గుంటూరు కారం కోసం శోభనని తీసుకురాబోతున్నారనే ప్రచారం జరిగినా అది సాధ్యం కాలేదు. అయితే భరత నాట్యంతో ఇప్పటీకి ప్రేక్షకులకి దగ్గరగా ఉంటున్న శోభన ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. శోభన చెన్నై లోని శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తన తల్లితో కలిసి నివసిస్తుంది. రెండస్తుల బిల్డింగ్ లో శోభన తన తల్లితో రెండో అంతస్తులో ఉండగా.. కింద భాగంలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అయితే శోభన తన తల్లి పెద్ద వయసుతో ఉండడంతో ఆమెని అనుక్షణం చూసుకుంటూ ఉండేందుకు ఓ కేర్ టేకర్ ని పెట్టారట.
కొట్టమన్నార్ కోవిల్ కి చెందిన విజయ అనే మహిళని కేర్ టేకర్ గా పనిలో పెట్టుకున్నారట. కొద్దిరోజులుగా తన తల్లి డబ్బు దొంగతనం అవుతూ ఉంది అని గమనించిన శోభన.. తమ ఇంట్లోకి ఇతరులు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో శోభన కేర్ టేకర్ విజయని ప్రశ్నించగా ఆమె మాత్రం తాను తియ్యలేదు అంటూ బుకాయించే ప్రయత్నం చెయ్యడంతో శోభన తేనం పేట పోలీస్ స్టేషన్ లో విజయపై కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులు విజయని విచారించగా ఆమె శోభన ఇంట్లో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకుందట.
తాను పేదరికం కారణంగానే 41 వేలు దొంగతనం చేసి డ్రైవర్ ఫోన్ నుండి కూతురికి గూగుల్ పే చేసినట్లుగా పోలీసు విచాణలో ఒప్పుకుందట. అయితే విజయ తనని క్షమించమని, పనిలో నుండి తియ్యొద్దని శోభనని వేడుకోవడంతో శోభన కూడా పెద్దమనసుతో ఆమెపై కేసుని విత్ డ్రా చేసుకుని ఆ 41 వేలు జీతంలో కట్ చేసుకుని, ఎప్పటిలాగే పనిలో కంటిన్యూ అవ్వమని చెప్పినట్లుగా తెలుస్తుంది.