కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్స్ వివేక్ అగ్నిహోత్రి కొద్ది రోజులుగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఆయన పదే పదే ప్రభాస్ పై, ఆయన చేస్తున్న సినిమాలపై కామెంట్స్ చెయ్యడంతో ప్రభాస్ ఫాన్స్ వివేక్ అగ్నిహోత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోల అభిమానులతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ దర్శకుడికి బాగా తెలిసొచ్చినట్టుగా ఉంది. అందుకే దెబ్బకి దారికొచ్చి నేను ప్రభాస్ ని అలా అనలేదు, ఇలా అనలేదు అంటూ వివరణ ఇస్తున్నారు.
ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ చేసిన సమయంలో కాశ్మీర్ ఫైల్స్ విడుదల చేసి హిట్ కొట్టాను. ఇప్పుడు ప్రభాస్ యాక్షన్ ఫిల్మ్ సలార్ రిలీజ్ చేసే సమయానికి వ్యాక్సిన్ వార్ విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నాను అంటూ వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ ని కించపరిచేవిలా ఉన్నాయంటూ ఆయన ఫాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా దైవంతో సమానమైన పురాణాలు అందరి మనసుల్లో ఇప్పటికి అలానే ముద్రపడి ఉన్నాయంటే వాటి ప్రాముఖ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొందరు స్క్రీన్ పైన దేవుడు పాత్రలో కనిపిస్తే నిజంగా దేవుళ్లు అయిపోతారా. రోజూ రాత్రి ఇంటికి తాగొచ్చి, తెల్లారి నేను దేవుడ్ని అంటే నమ్మడానికి ప్రేక్షకులు ఏమైనా పిచ్చోళ్లా.. అంటూ ప్రభాస్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారంటూ సోషల్ మీడియాలో ఆయన పేరునే హైలెట్ చేసారు.
కానీ వివేక్ అగ్నిహోత్రి మాత్రం ఇలాంటి అసత్యపు వార్తలు ఎలా పుడతాయో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదు అని.. భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రభాస్ ను తను గౌరవిస్తానని, ఇలాంటి అర్థంలేని ఫేక్ స్టేట్ మెంట్స్ ను ఎవరు పుట్టిస్తున్నారో తనకి తెలుసుకోవాలనుంది అంటూ ప్రభాస్ పై ఆయన ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు అంటూ వివరణ ఇస్తూ ట్వీట్ చేసారు. మరి ప్రభాస్ ఫాన్స్ కి ఆయన భయపడే ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి తయారు చేసి వదిలాడంటూ కొంతమంది ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు.