ఫ్యామిలీగా నేనైనా.. వైష్ణవ్ తేజ్, సాయి తేజ్, చరణ్ అన్న అయినా కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం.. మా సపోర్ట్ ఎప్పుడూ బాబాయ్‌కి ఉంటుందని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ ఫస్ట్ టైమ కలిసి నటించిన ‘బ్రో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..
కళ్యాణ్ బాబాయ్, తేజ్ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసి, నేను చేయలేకపోతున్నానని మొదట కొంచెం అసూయగా అనిపించేది. కానీ దానికి వంద రెట్లు ఇప్పుడు ఆనందం కలిగింది. తేజ్‌కి కళ్యాణ్ బాబాయ్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయనను ఓ గురువులా భావిస్తాడు. కళ్యాణ్ బాబాయ్‌తో సినిమా చేసే అవకాశం తేజ్‌కి రావడం.. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. తేజ్‌కి ఇది మరపురాని చిత్రమవుతుంది. కళ్యాణ్ బాబాయ్ గురించి ఇలా స్టేజ్ మీద మాట్లాడే అవకాశం నాకు ఇప్పటివరకు రాలేదు. బాబాయ్ గురించి మాట్లాడాలంటే వణుకొస్తోంది. బాబాయ్ గురించి కొన్ని మాటల్లో చెప్పడం కష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా చేయి, అలా చేయమని ఎప్పుడూ మమ్మల్ని బలవంత పెట్టలేదు. మీరు ఎదగాలనుకున్న రంగంలోనే కష్టపడి ఎదగండి అని మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మాకు హార్డ్ వర్క్ ఒకటే నేర్పించారు. అది బాబాయి అయినా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారైనా.
ఇప్పుడు బాబాయ్ రాజకీయంగా బయటికి వెళ్లి ఎండ, వాన అని లేకుండా తిరుగుతున్నప్పుడు ఒక కొడుకుగా బాధ వేస్తుంది. ఇంత కష్టపడాలా? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మా కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. మీ కుటుంబాలకు దగ్గరవుతున్నారని ఆనందపడుతున్నాం. ఆ ఆలోచన మాకు సంతృప్తికరంగా అనిపిస్తుంటుంది. బాబాయ్ వెనకాల మీరు (అభిమానులు) ఎప్పుడు ఉంటారని మాకు తెలుసు.. అదే మా నమ్మకం, అదే మా ధైర్యం. మీరే కాదు మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ మా కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా అది సినిమాలైనా, రాజకీయాలైనా, సర్వీస్ అయినా అండగా ఉంటాం. ఫ్యామిలీగా నేను, వైష్ణవ్ తేజ్, తేజ్, చరణన్న.. అందరం కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. ఇది ఏదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు, మనసు లోపల నుంచి చెప్పే మాట. బ్రో సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాబాయ్ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చూశారు, ఇది కూడా హిట్ అవుతుంది, బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నట్లుగా వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.