ఆస్పత్రిలో సాయి తేజ్‌ని చూసి ఏం చేయలేని పరిస్థితిలో.. నేను ఆ దేవుడ్ని ఒక్కటే అడిగా. ఇంకా చాలా జీవితం ఉంది.. జీవించాల్సిన వాడు రక్షించు అని కోరుకున్నానని అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైమ్‌గా నటించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా జూలై 28న విడుదలకాబోతోన్న సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు తన పరిస్థితి ఏంటో, భగవంతుడిని తను ఏం కోరుకున్నారో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
సాయి ధరమ్ తేజ్ నటుడు కావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను ఎంకరేజ్ చేయలేదు.. అలా అని డిస్కరేజ్ కూడా చేయలేదు. నా బాధ్యతగా యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించాను అంతే. తన కష్టం మీద ఇక్కడివరకు వచ్చాడు. సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయిందనే విషయం త్రివిక్రమ్‌గారు ఫోన్ చేసి చెబితే హాస్పిటల్‌కి వెళ్ళాను. తను స్పృహలో లేడు. ఈరోజు తేజ్ ఇక్కడ నిలబడి మళ్ళీ సినిమా చేయగలిగాడు అంటే ఆరోజు కాపాడిన ఇస్లాం సమాజానికి చెందిన అబ్దుల్ సాహెద్ ఫరాన్ అనే కుర్రాడు కారణం. అందుకే కుల, మత, ప్రాంతాలను విభజించి చూడను. సహాయానికి అవేమీ అవసరం ఉండవు. ఆరోజు అతను సమయానికి స్పందించకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అలా సమయానికి మానవత్వం ప్రదర్శించేవారిని నేను గుండెల్లో పెట్టుకుంటాను. నేను కూడా షూటింగ్స్ సమయాల్లో అలా చాలా సార్లు రియాక్ట్ అయ్యాను. తెల్ల చొక్కా అంతా బ్లడ్ అయిపోయేది. ఈ విషయం చాలా మందికి తెలియదు.
సాయి తేజ్ క్షేమంగా 24 గంటల్లో వచ్చేస్తాడని అనుకుంటున్నాం.. కానీ డాక్టర్స్ గ్యారంటీ చెప్పలేకపోయారు. 10 రోజల పాటు కోమాలో ఉన్నాడు. ఈ సినిమా అతనికి చాలా రిలవెంట్‌గా ఉంటుంది. ఆస్పత్రిలో సాయిని చూసి నాకు నిస్సహాయత వచ్చేసింది. అతన్ని మళ్లీ ఇలా బయటికి తీసుకొచ్చిన మెడికవర్, అపోలో హాస్పటల్ వైద్యులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆస్పత్రిలో సాయి తేజ్‌ని చూసి ఏం చేయలేని పరిస్థితిలో.. నేను ఆ దేవుడ్ని ఒక్కటే అడిగా. ఇంకా చాలా జీవితం ఉంది.. జీవించాల్సిన వాడు రక్షించు అని అడిగా. ఓ మూల కూర్చుని, రోదిస్తూ.. వాడిని బ్రతికించవా భగవంతుడా? అని అడిగా. అంతకుమించి ఇంకేమీ అడగలేదు. నేను ఆరాధించే ఆ జగన్మాతని ప్రార్థించా. తేజ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా సాయి తేజ్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌గారే సూచించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.