నార్త్‌లో పాపులర్ అయినట్లుగా బిగ్‌బాస్ అనేది సౌత్‌లో అంతగా పాపులర్ కాలేదు. మొదట్లో పేరున్న సెలబ్రిటీస్ బిగ్‌బాస్‌లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించినా.. హౌస్‌లో జరిగే ముచ్చటంతా చూసి.. మనకెందుకులే ఈ పంచాయితీ అని అంతా ముఖం చాటేస్తున్నారు. దీంతో.. తర్వాత సీజన్స్‌లో సెలబ్రిటీస్‌ని తీసుకురావడానికి బిగ్‌బాస్ యాజమాన్యం నానా తంటాలు పడుతుంది. అందుకే కొన్ని సీజన్స్ నుండి సీరియల్ ఆర్టిస్ట్‌లు, యూట్యూబర్స్‌తో సరిపెట్టేస్తుంది. ఇక మరో రెండు నెలల్లో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 7 కోసం యాజమాన్యం అప్పుడే కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే నచ్చావులే లాంటి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాధవి లతని సీజన్ 7 కి రావాల్సిందిగా ఆహ్వానం పంపారట. కానీ మాధవి లత మాత్రం నో చెప్పిందట. ఇదే విషయాన్ని మాధవి లత కూడా ధ్రువీకరించింది. బిగ్ బాస్‌లో పాల్గొనాలని తనకి అవకాశం వచ్చింది అని, కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్లుగా చెప్పిన మాధవి లత.. మరో విషయాన్ని కూడా లీక్ చేసింది. తనకి ఇప్పుడొకసారే కాదు.. ఇంతకుముందు కూడా రెండుసార్లు బిగ్ బాస్‌కి రమ్మని ఆహ్వానం వచ్చిందని తెలిపింది.
కానీ నాకు బిగ్ బాస్‌కి వెళ్లాలనే కోరిక, ఆసక్తి రెండూ లేవు. నన్ను బిగ్ బాస్‌లో పాల్గొనమని ఆహ్వానించిన టీం కి థాంక్స్.. అంటూ మాధవి లత తనకి బిగ్ బాస్ ఆఫర్ ఒకటి కాదు మూడు సార్లు వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. ఒక్క మాధవీ లత అనే కాదు.. ఆ రచ్చ భరించలేకే వెళ్లలేదనేలా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ ఇంటర్వ్యూలలో తెలిపారు.