పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర అంటూ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నారు. ఏపీలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో మీటింగ్స్, వారాహి బస్సు యాత్ర, బహిరంగ సభలంటూ చాలా హడావిడిగా ఉన్నారు. గత పది రోజులుగా పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా చేస్తున్న పనులతో ఆయన పూర్తిగా అలిసిపోయి జ్వరం తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పవన్ ని పరీక్షించిన వైద్యులు ఆయన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో వారాహి విజయ యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు పవన్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిలాల్ లోని అన్నవరం దేవస్థానం నుండి వారాహి బస్సు యాత్ర చేపట్టి తూర్పుగోదావరి జిల్లాను చుట్టేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. విశ్రాంతి లేకుండా సభలు, సమావేశాల్లో పాల్గొనడంతోనే పవన్ ఆరోగ్యం దెబ్బతినిందని తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న పవన్ జ్వరం నుండి త్వరగా కోలుకోవాలంటూ పవన్ ఫాన్స్, జనసేన నేతలు పూజలు చేస్తున్నారు.