సమ్మర్ లో పెద్ద సినిమాల సందడి ఉంటుంది అనుకుంటే బాక్సాఫీసు దగ్గర చిన్న సినిమాలు, మీడియం సినిమాల జాతర కనిపించింది. పోనీ అవైనా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా అంటే అదీ లేదు. వారం వారం నిరుత్సాహమే కనిపించింది. గత రెండు నెలలుగా బాక్సాఫీసు దగ్గర పొలోమంటూ సినిమాలు రావడం పోవడమే కానీ.. ఒక్క సినిమా కూడా పట్టుమని రెండు వారలు థియేటర్స్ లో సందడి చేసిన సందర్భం కనిపించలేదు. కనీసం ప్రభాస్ ఆదిపురుష అయినా బాక్సాఫీసుకి ప్రాణం పోస్తుంది అనుకుంటే అది కూడా నిరుత్సాహ పరిచింది.
నేడు శుక్రవారం ఎప్పటిలాగే బాక్సాఫీసు కళకళలాడుతుంది.. అనుకుంటే ఈ వారం చిన్న సినిమాలతో, ఊరు పేరు లేని, ప్రమోషన్స్ లైట్ తీసుకున్న సినిమాలన్నీ విడుదలకు రెడీ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటో రెండో మాత్రమే ప్రేక్షకుల్లోకి వెళ్ళాయి. అవేమి ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యేవి కాదు. ఈ వారం థియేటర్స్ లోనే కాదు ఓటిటీలలోను చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ వారం థియేటర్స్ లో విడుదలవుతున్న చిత్రాల్లో అంతో ఇంతో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్న చిత్రం మను చరిత్ర. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చిన్నగా ప్రమోషన్స్ చేసుకుంటూ నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. తర్వాత తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన భీమ దేవరపల్లి బ్రాంచ్, భారీ తారాగణం, కర్ణ, మా ఆవారా జిందగీ, కుట్ర-ది గేమ్ స్టార్ట్స్ నౌ, జాగ్రత్త బిడ్డ, కవిన్స్ వీటితో పాటుగా అశ్విన్స్ అనే హర్రర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమాల లిస్ట్ అయితే భారీగా కనిపిస్తుంది కానీ.. బాక్సాఫీసు దగ్గర టికెట్స్ మాత్రం తెగడం లేదు.
ఈ వారం బాక్సాఫీసుని చూస్తే అయ్యో పాపం బాక్సాఫీసుకి ఎంత కష్టం వచ్చింది అనుకోకమానరు. అసలే ఆదిపురుష్ చికాకులో ఉన్న వారికి ఈ వారం మరింతగా బోర్ కొట్టించేసింది.