ఇప్పుడు చాలామంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ కమెడియన్ అలీ వైసిపిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. మరోపక్క పోసాని కృష్ణమురళి కూడా వైసీపీ ప్రభుత్వంలో పదవిని అనుభవిస్తున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ప్రకటించాడు. అతనే కమెడియన్ కమ్ హీరో సప్తగిరి. కమెడియన్ గా హీరోగా సత్తా చాటుతున్న సప్తగిరి రీసెంట్ గానే అన్ స్టాపబుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజాగా సప్తగిరి రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కన్ ఫామ్ చెయ్యడమే కాదు.. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు సప్తగిరి ప్రకటించాడు. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించాడు. తనది చిత్తూరు జిల్లానే అని, చిత్తూరు జిల్లా ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టానని సప్తగిరి చెప్పారు. బంగారుపాళ్యం, పుంగనూరులో చదివానని చెప్పిన సప్తగిరి పేదల కష్టాలు నాకు తెలుసు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తా అని చెప్పాడు.
ఇప్పటివరకు తాను నిజాయితీగానే ఉన్నాను, సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాను, అలాగే పాలిటిక్స్ లోను మంచి పేరు తెచ్చుకుంటాను, అయితే సినిమాల వలనే నాకు రాజకీయాల్లో ఆకాశం వచ్చింది. అందుకే సినిమాలు మాత్రం వదిలే ప్రసక్తి లేదు అంటూ సప్తగిరి తన పొలిటికల్ ఎంట్రీ పై మాట్లాడాడు.