ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కాలితో తన్ని, తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి, పైగా దుర్భాషలాడిందంటూ డింపుల్ హయాతిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. రాహుల్ హెగ్డే కారు డ్రైవర్ ఆమెపై పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. ఆ తర్వాత డింపుల్ సైడ్ నుంచి ఎటువంటి వాదనలు వినిపించాయో తెలియంది కాదు. దీంతో ఈ మ్యాటర్ ఆసక్తికరంగా మారి హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఆ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో డీసీపీ కారు పక్కన ప్రభుత్వ ప్రాపర్టీకి చెందిన ట్రాఫిక్ డివైడ్ చెయ్యడానికి ఉపయోగించే పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు ఉండటంతో.. ఇది మాములు వ్యవహారం కాదనేలా వార్తలు వైరల్ అయ్యాయి.
మరో సైడ్ డింపుల్‌ను పోలీస్ స్టేషన్‌లో అవమానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా ఓ నాలుగైదు రోజుల పాటు బాగా హడావుడి జరిగిన ఈ వ్యవహారం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. దీంతో ఇరు వర్గాలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నారని అంతా అనుకుంటున్న సమయంలో.. ఈ కేసు కోర్టుకి చేరినట్లుగా తాజాగా వచ్చిన కోర్టు తీర్పుతో తెలియవచ్చింది. పోలీసులు తన వాదనని వినకపోవడంతో.. తన లాయర్ ద్వారా డింపుల్ హైకోర్టును ఆశ్రయించింది. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తనపై ఈ తప్పుడు కేసు నమోదు చేశారనేలా ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై తప్పుడు కేసు పెట్టారని తెలుపుతూ.. తనని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. డింపుల్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.
కోర్టులో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న విక్టర్ డేవిడ్ అనే అతనికి ఎందుకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహించాలని పోలీసులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అలాగే డింపుల్‌ని కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.