గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జానకిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ యమా పీక్స్‌లో ఉన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం తిరుపతిలో భారీగా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైనవారంతా ప్రభాస్ స్పీచ్ కోసం ఎంతగా వెయిట్ చేశారంటే.. ఒక వైపు చెమటలతో శరీరమంతా తడిసిపోతున్నా కూడా డార్లింగ్ స్పీచ్ కోసం అలానే నిలబడిపోయారు. ఎందుకు డార్లింగ్ స్పీచ్ కోసం అంతగా వెయిట్ చేశారంటే.. పెళ్లి గురించి ఏమైనా చెబుతాడేమోనని.
అయితే వారు ఊహించినట్లే, వారు కోరినట్లే ప్రభాస్ పెళ్లి గురించి చెప్పాడు కానీ.. మళ్లీ ఇరకాటంలో పడేశాడు. ‘ఆదిపురుష్’ గురించి ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ మ్యారేజ్ అప్‌డేట్ కావాలంటూ కోరారు. దీంతో చేసేది లేక, ఏం చెప్పాలో అర్థం కాక.. ‘ఇక్కడే.. తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటా’ అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానం విన్నవారంతా తెల్లముఖం వేశారు. ఎందుకంటే.. వారు ఊహించిన సమాధానం అయితే అది కాదు. తన పెళ్లి త్వరలోనే ఉంటుందని, అన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెప్పినా.. ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యేవారు. కానీ ‘ఎప్పుడైనా చేసుకుంటా’ అంటే.. ప్రభాస్ పెళ్లి చేసుకోడా ఏంటి? అనేలా ఫ్యాన్స్ ముఖచిత్రాలు మారిపోయాయి.
ఇక ఈ సినిమా కోసం ఓం రౌత్‌తో పాటు మరికొందరు రోజూ రెండు మూడు గంటలే నిద్రపోతూ కష్టపడుతున్నట్లుగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం. ఆ మధ్య చిరంజీవిగారు ‘రామాయణం’పై సినిమా చేస్తున్నావట కదా.. అని అడిగారు. అవును సార్ అని చెప్పగా.. ఇలాంటి అదృష్టం అందరికీ దొరకదు.. నీకు లభించింది అంటూ అభినందించినట్లుగా ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతగానో కష్టపడింది. ఓం రౌత్ ఓ యుద్ధమే చేశాడు. చినజీయర్ స్వామిగారు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చి.. ఈ సినిమా స్వరూపానే మార్చేశారు. ఈ సినిమా నటించిన వారంతా ప్రాణం పెట్టేశారు. టెక్నికల్‌గానూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ.. నా బలం ప్రేక్షకులు, అభిమానులే. ఈ సినిమా విషయంలో మీ అభిమానమే ఇంత వరకు తీసుకొచ్చింది. మాములుగా నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఈసారి కాస్త ఎక్కువే మాట్లాడేశా. ఇకపై మాటలు తగ్గించి.. సినిమాలు ఎక్కువ చేసి.. అందరినీ ఆనందపరుస్తాను. ఇకపై ఏడాదికి రెండు, ఇంకా వీలయితే మూడు సినిమాలు చేస్తానని అభిమానులకు ఈ వేదికగా ప్రభాస్ మాటిచ్చాడు.