గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ జానకిగా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండగా.. మేకర్స్ ప్రొమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో భారీ స్థాయిలో జరపబోతున్నారు. ఇప్పటికే టీమ్ అంతా తిరుపతి చేరుకుని, శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ మేకర్స్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత.. సినిమా ప్రదర్శించబడే ప్రతి థియేటర్లో ఒక సీటును ఖాళీగా ఉంచబోతున్నారు. ఎందుకలా అనేది చెబుతూ ప్రత్యేకంగా వారే ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అందులో
‘‘రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్‌ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం..’’ అని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
ఈ నిర్ణయంతో ఇప్పుడు ‘ఆదిపురుష్’ మరింతగా వార్తలలో నిలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు అందరూ విమర్శించారు. ఇదేదో యానిమేషన్ సినిమాలా ఉందంటూ కామెంట్స్ చేయడంతో.. దర్శకుడు ఓం రౌత్ దిద్దుబాబు చర్యలు చేపట్టారు. అందుకోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ వర్క్‌లో భారీ మార్పుల అనంతరం.. విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా.. ప్రస్తుతం ప్రొమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. ఇప్పుడీ సినిమా విడుదలైన థియేటర్లలోకి హనుమంతుడు కూడా వచ్చి.. ప్రేక్షకులతో ఈ సినిమాని చూస్తాడనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి.. ఈ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సి ఉంది.