‘ఆదిపురుష్’ సినిమాపై ఆ నిర్మాతకు అనుమానమా? అందుకే ఈ సినిమా హక్కులు తీసుకోలేదా? లేదంటే ఇంతకు ముందు ఇదే తరహాలో తెరకెక్కిన సినిమా ఇచ్చిన రిజల్ట్‌తో వెనక్కి తగ్గాడా? ఏదిఏమైనా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదిపురుష్ కంటే కూడా ఆ నిర్మాత గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నిర్మాత అనుకుంటున్నారా? ఇంకెవరు.. సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్ రాజు. నిర్మాతగానే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్ రాజు టాప్ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఏ సినిమా అయినా సరే.. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల విషయంలో దిల్ రాజు పేరే ముందు వినిపిస్తుంది. అందులోనూ ప్రభాస్ సినిమా అంటే.. ఆయన పరుగెత్తించి మరీ కొనేస్తారు. అలాంటిది ‘ఆదిపురుష్’ విషయంలో ఆయన వెనక్కి తగ్గడంతో ఇప్పుడనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా నైజాం ఏరియాకు సంబంధించి మొదట దిల్ రాజు పేరే వినబడింది. కానీ ఇప్పుడు మరో సంస్థ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అసలు దిల్ రాజు ఈ సినిమా హక్కుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాడు? ‘శాకుంతలం’ నేర్పిన పాఠమా? లేక సినిమాలోనే విషయం లేదా? అనేలా టాలీవుడ్ అంతటా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘ఆదిపురుష్’ తరహా చిత్రమైన ‘శాకుంతలం’ విషయంలో దిల్ రాజు భారీగా నష్టపోయారు. మళ్లీ ఆ సాహసం చేయలేకే వెనక్కి తగ్గి ఉంటారా? లేక ఆల్రెడీ ఆదిపురుష్‌లోని మ్యాటర్ ఏంటో తెలుసుకున్న ఆయన.. కావాలనే పక్కకు జరిగారా? దీనిపై క్లారిటీ రావాలంటే జూన్ 16 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక దిల్ రాజుకు పోటీగా నైజాం హక్కులు పొందాలంటే ఇప్పటి వరకు అటు వైపు వరంగల్ శ్రీను పేరు వినిపించేది. ఇప్పుడా స్థానంలోకి మైత్రీ మూవీ మేకర్స్ వచ్చి చేరారు. ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల రైట్స్ మొత్తాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరను వెచ్చించి తీసుకోగా.. వారి నుంచి నైజాం రైట్స్‌ను మైత్రీ సంస్థ రూ. 60 కోట్లకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాఘవుడిగా ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో ఆయన భార్య సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు.