ఈ మధ్య వస్తున్న సినిమాలను గమనిస్తే ‘నా కొడకా’ అనే పదం లేకుండా సినిమాలు ఉండటం లేదు. అందులోనూ హీరోతోనూ, విలన్‌తోనూ నా కొడకా అంటే నా కొడకా అంటూ మాట్లాడిస్తున్నారు. పౌరుషం ప్రదర్శించడానికి ఉన్న ఒకే ఒక్క పదం ఇదే అన్నట్లుగా అందరూ.. ఆఖరికి మాటల మాంత్రికుడు, గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇదే బాట పట్టడం విడ్డూరం. ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ఒకరినొకరు ‘నా కొడకా, నాకొడకా’ అని తిట్టుకుంటుంటే.. ఎవరు ఎవరికి కొడుకో అర్థం కాక జనాలు జుట్టు పీక్కునే పరిస్థితి నెలకొంది. పవన్ కల్యాణ్ వంటి హీరో నోటి వెంట అలాంటి పదం పదే పదే రావడం ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు.
ఇక రీసెంట్‌గా వచ్చిన అల్లరి నరేష్ చిత్రం ‘ఉగ్రం’లో ఈ పదం ఎన్ని సార్లు వచ్చిందో చెప్పడానికి లెక్కే లేదు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో మ్యాగ్జిమమ్ అల్లరి నరేష్ నోటి వెంట ఈ పదం వస్తూనే ఉంటుంది. ఒక్క అల్లరి నరేష్ చిత్రమనే కాదు.. ఈ మధ్య వస్తున్న చిత్రాలన్నింటిలోనూ ఈ పదం కామన్ అయిపోయింది. పౌరుషానికి ప్రతీకగా ఈ పదాన్ని మన ఫిల్మ్ మేకర్స్ ఫిక్సయిపోయినట్లున్నారు. సెన్సార్ వాళ్లు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఏదో.. ఒకటీ, అరా సందర్భంలో అయితే ఓకే గానీ, మాటకు ముందు ఒకసారి.. మాటకు తర్వాత ఒకసారి.. విలన్ అని లేదు, హీరో అని లేదు.. అందరి నోటి వెంట ఈ పదం వినిపించడం చాలా ఎబ్బెట్టుగా ఉందనేది ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాట.
వాస్తవానికి హీరోగానీ, విలన్‌గానీ పౌరుషం ప్రదర్శించడానికి ఈ పదం వాడాల్సిన అవసరం లేదనేది గతంలో.. అంటే పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ వంటివారు రైటర్స్‌గా ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు గమనిస్తే బెటర్. ‘ఇంద్ర’ సినిమాలో ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్‌ని పరుచూరి బ్రదర్స్ రాశారు. ఆ డైలాగ్ ఇప్పుడున్న రైటర్స్ రాయాలంటే.. ఖచ్చితంగా పైన చెప్పుకున్న పదం ఉంటుంది.. అలా మారిపోయింది పరిస్థితి. అయితే ఇందులో త్రివిక్రమ్ వంటివారు కూడా ఉండటమే సినీ ప్రేక్షకులకి బాధేస్తుంది. ఈ పదం వాడొద్దు అని చెప్పడం లేదు కానీ.. కాస్త ప్రక్షాళన చేయమని అంటే పదే పదే రాకుండా చూసుకోమని మాత్రం ప్రేక్షకులు కోరుకుంటున్నారు.