పెద్దరికం అనేది పదవితో రాదు.. మంచి చేయాలనే గొప్ప మనసుతో వస్తుంది. ఇప్పుడెందుకీ పెద్దరికం మాటలని అనుకుంటున్నారా? మెగాస్టార్ చిరంజీవి మరొక్కసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. శనివారం ఆయన ఓ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్‌కు హాజరయ్యారు. అందులో ఆయన చెప్పిన మాటలు అర్థం కాక అందరూ మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ అంటూ వార్తలు వైరల్ చేశారు కానీ.. అసలు విషయాన్ని మాత్రం సైడ్ ట్రాక్ పట్టించారు. ఏంటా అసలు విషయం అనుకుంటున్నారా?
అంతకు ముందు చిరంజీవి ఇలానే ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు.. సినీ కార్మికులకు, మీడియా వారికి, ఆయన అభిమానులకు చేసే పరీక్షలలో రాయితీని అడిగారు. మెగాస్టార్ కోరగానే.. ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు లైఫ్ లాంగ్ సగం ధరకే పరీక్షలు చేసేలా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్‌కు వెళ్లిన చిరంజీవి.. వారికి కూడా ఇండస్ట్రీలో పేద సినీ కార్మికులకు, అభిమానులకు, మీడియా వారికి క్యాన్సర్‌ను గుర్తించే ముందస్తు టెస్ట్‌లను నిర్వహించాలని కోరారు. అందుకు ఎంత ఖర్చు అయినా సరే తనే భరిస్తానని వాగ్ధానం చేశారు.
డబ్బులు ఖర్చుపెట్టలేని పేదవారికి, నా అభిమానులకు, అలానే నిరుపేద సినీ కార్మికులకు క్యాన్సర్‌ని గుర్తించే ముందస్తు టెస్ట్‌లకి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను...అది ఎంతైనా పర్లేదు... దానికి సంబంధించిన ఖర్చు అంతా నాకు ఒక ఫార్మెట్‌లా ఇవ్వండి.. అని చిరు కోరగానే ఆ క్యాన్సర్ సెంటర్ వారు ముగ్ధులయ్యారు. ఇంతవరకు ఇలాంటి ప్రపోజల్ ఎక్కడా వినలేదని, మీలాంటి గొప్పవారికే ఇలాంటి థాట్స్ వస్తాయంటూ.. తప్పకుండా తమ సైడ్ నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది అసలు విషయం. కానీ ఈ విషయాన్ని పక్కనెట్టి.. క్యాన్సర్ రాకుండా ముందస్తు పరీక్షలతో జాగ్రత్తపడిన వైనాన్ని ఆయన తెలిపితే.. చిరంజీవికి క్యాన్సర్ అంటూ వార్తలు వండారు. మళ్లీ చిరంజీవే ఆ వార్తలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తంగా అయితే.. ఇండస్ట్రీలో పెద్దరికం వద్దని ఆయన అన్నప్పటికీ.. ఇలాంటి గొప్ప మనసే పెద్దరికం అని పదేపదే మెగాస్టార్ చాటుతూనే ఉన్నారు.