ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ జయంతి. ఆయనకి నివాళులు అర్పిస్తూ గత ఏడాది కాలంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను జరిపిస్తున్నారు. ప్రజల గుండెల్లో దేవుడు, సినిమా ఇండస్ట్రీని శాసించిన దిగ్గజం.. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో దేవతామూర్తిలా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు ప్రముఖులే కాదు.. తెలుగుప్రజలంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ 100 వ జయంతి సందర్భంగా సినీ, రాజాకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెడుతున్నారు.
నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చి పుష్ప గుచ్చాలు ఉంచి నివాళుల అర్పిస్తున్నారు. తెల్లవారు ఝామునే బాలకృష్ణ ఇతర తెలుగు దేశం కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ కి తరలి వచ్చారు. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు. నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచం మొత్తం తెలుగువారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ఆయన సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో సైతం సత్తా చాటారు. తనని అంతగా అభిమానించిన తెలుగుప్రజల రుణం తీర్చుకోవడం కోసం నాన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టి అయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలు చారిత్రాత్మకంగా నిలిచాయి. జాతీయ రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రభావం చూపించారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టం అని అన్నారు.
బాలయ్యతో పాటుగా మరికొంతమంది కుటుంభ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ లో పెద్దాయనకి నివాళులర్పించారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతగారికి నివాళులు అర్పించారు. సోషల్ మీడియాలో మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 అంటూ పోస్ట్ కూడా పెట్టాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాస్త గందరగోళం ఏర్పడింది.