సంతోష్ శోభన్ ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి హీరోగా అడిగి పెట్టిన కుర్రాడు. చిన్న చిన్న సినిమాలతో హైలెట్ అవుతూ హీరోగా నిలదొక్కుకోవడానికి చెయ్యని ప్రయత్నాలు లేవు. కుర్రాడు బాగానే ఉంటాడు. యాక్టింగ్ కూడా పర్వాలేదు. కానీ అదృష్టమే అతనికి కలిసి రావడం లేదు. వరసగా సినిమాలు చేస్తున్నాడు.. ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.. అతని సినిమాల్లో విషయం లేకపోవడంతో ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.. దానితో సక్సెస్ ఆమడ దూరంలోనే ఆగిపోతుంది.
ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరు-బాలయ్యలతో పోటీ పడి కళ్యాణం కమనీయం అన్నాడు. కానీ ఆ సినిమా సంతోష్ కి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత నెల గ్యాప్ లోనే మెగా డాటర్ సుస్మిత బ్యానర్ లో శ్రీదేవి శోభన్ బాబు తో ప్రేక్షకులని పలకరించాడు. ఆ సినిమా కూడా డిసాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్ గా అన్ని మంచి శకునములే కూడా సంతోష్ నమ్మకాన్ని ఒమ్ముచేసింది.
పేరున్న నిర్మాతలు, పెద్ద బ్యానర్, మంచి కథలను ఎంచుకునే దర్శకురాలు అయినా సంతోష్ ని ప్లాప్ ల గండం నుంచి గట్టెక్కించలేదు. అన్ని మంచి శకునములే అశ్విని దత్ కుమార్తెలు నిర్మాతలు, నందిని రెడ్డి దర్శకురాలు భారీ ప్రమోషన్స్ అయినా.. అన్ని మంచి శకునములే సంతోష్ కి మరో ప్లాప్ ని అంటగట్టింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ప్రేమ్ కుమార్ అనే ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇలా వరస డిజాస్టర్స్ ఉన్న ఈ హీరోకి ఇకపై ఎలాంటి ఛాన్సెస్ వస్తాయి.. ఎవరు ఇస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
పేరున్న దర్శకులు, పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు అంటే అది దురదృష్టమనే అనుకోవాలి. అదృష్టం కోసం వేచి చూడాలి. అన్ని విషయాల్లో అపరమత్తంగా ఉండాలి.