కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు అంటూ అమ్మ సెంటిమెంట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట మాత్రమే కాకుండా.. తెలుగులోనూ భారీ విజయం సాధించారు. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనిపై తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన అభిమానం మొదలయ్యింది. ఆ చిత్రంలో ధనవంతుడైన కొడుకు తల్లి ఆరోగ్యం కోసం దీక్ష చేపట్టి బిచ్చమెత్తుకోవడం అనేది అందరి మనసులని టచ్ చేసింది. ఆ తర్వాత విజయ అంటోని అటు ఇటుగా ఓ ఆరేడు సినిమాలు చేసినా మళ్ళీ బిచ్చగాడి స్థాయి విజయం అందుకోలేకపోయారు.
బిచ్చగాడు సెంటిమెంట్ వర్కౌట్ చెయ్యాలని దానికి సీక్వెల్ గా సిస్టర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు 2 తెలుగు, తమిళ భాషల్లో చేసారు. తెలుగునాట తనకున్న క్రేజ్ దృష్యా విజయ అంటోని తెలుగులో సినిమాని భారీగా ప్రమోట్ చేసారు. విజయ్ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు 2 నిన్న శుక్రవారం తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాగా.,. ఈ చిత్రానికి యావరేజ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. తల్లి సెంటిమెంట్ ముందు సిస్టర్ సెంటిమెంట్ తేలిపోయింది అనే అభిప్రాయాలు ప్రేక్షకులు వ్యక్తం చేసారు.
ప్రథమార్ధాన్ని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించిన విజయ్.. ద్వితీయార్ధం మాత్రం ఆ గ్రిప్ ని, ఆ ఇంట్రెస్ట్ ని కొనసాగించలేకపోయారు. విజయ్ ఆంటోని పెరఫార్మెన్స్, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు బావున్నప్పటికీ.. కథనంలో లోపాలు, స్లో నేరేషన్, స్క్రీన్ ప్లే అన్ని ప్రేక్షకులని ఇబ్బంది పెట్టాయి. సిస్టర్ సెంటిమెంట్ కూడా బలంగా లేకపోవడం ప్రధానమైన లోపంగా బిచ్చగాడు 2 లో కనిపిస్తుంది.