తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఢిల్లీ నుండి గల్లీ దాక ప్రతి ఇంట్లోనూ సీతాసమేత రాముడి ఫోటో ఉంటుంది. ప్రతి ఏడు ఏప్రిల్ లో శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణాన్ని ప్రతి గుడిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు అంటే పటంలో చూపించిన అనిర్వచనీయమైన రూపం. దయామయుడు. శాంతికి ప్రతి రూపం, సీతని తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడని పవర్ ఫుల్ వ్యక్తి.. ఇదే రామాయణంలో చూపించిన శ్రీరాముడి కథ. అలా దేవుడి గుడిలో విగ్రహ రూపం, ఇంట్లో ఫోటో ఫ్రెమ్ తర్వాత మళ్ళీ అంతటి బలమైన ముద్రని తెలుగు రాష్ట్రాల హిందువుల్లో నాటింది నందమూరి తారకరామారావే. శోభన్ బాబు, శ్రీరామ రాజ్యంలో బాలయ్య బాబు ఇలా రాముడి వేషం ఎవరు కట్టినా అది అందరిమనసుల్లో అల్లుకుపోయినా.. తారకరాముడి తరవాతే ఎవరి గెటప్ అయినా అన్నంతగా తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ని పూజించారు.
అలా ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడి రూపం పదిలంగా ఉన్న సమయంలో ప్రభాస్ ఆదిపురుషుడిగా మోడ్రెన్ రామాగా.. మరో బాహుబలిని తలపిస్తూ ఆదిపురుష్ అంటూ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే పాత రామాయణ కథ. అదే రావణుడి కోరిక. కానీ ఇక్కడ ఆదిపురుష్ లో పాత్రలు తాలూకు లుక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. మీసకట్టుతో ప్రభాస్ రాముడిగా నిజమైన మోడ్రెన్ రామగా కనిపిస్తున్నాడు. మరి మీసాల రాముడు ఎంతమందిని ఇంప్రెస్ చేసాడో కానీ.. ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన నెగిటివిటీని ఆదిపురుష్ ట్రైలర్ సమర్ధవంతంగా ఎదుర్కొంది.
మరి రామాయణం సినిమాల రూపంలో సీరియల్స్ రూపంలో చూసేసి ఉన్న ప్రేక్షకులు ఈ మోడ్రెన్ ఆదిపురుషుడిని ఎంతవరకు ఆదరిస్తారో.. అసలు మోడ్రెన్ రామని గ్రాఫిక్స్ తో యాక్సెప్ట్ చేస్తారో కొంతమందికి అర్ధం కాకపోయినా.. తెలుగు రాష్ట్రాలే కాదు.. బాహుబలి మ్యానియాతో ఉన్న ఇండియా వైడ్ ప్రేక్షకులు ప్రభాస్ కోసం ఖచ్చితంగా ఆదిపురుష్ ని ఆదరించడం పక్కా అంటూ యూత్ నుండి వినిపిస్తున్న మాట.