గత రెండు నెలల్లో ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతున్నా ఇంట్రస్టింగ్ గా అనిపించింది కేవలం నాని దసరా. అది మార్చి 30 న రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఏప్రిల్ 27 న ఓటిటిలోకి వచ్చేసింది. ఇక ఏప్రిల్ లో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ప్రేక్షకులకి బాగా నచ్చింది. గతవారం అఖిల్ ఏజెంట్ పై పెట్టుకున్న నమ్మకాన్ని అది ఒమ్ము చేసింది. ఇక ఈ నెలలో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యడానికి రావడం లేదు. గోపీచంద్, అల్లరి నరేష్, నాగ చైతన్య ఇలా మీడియం రేంజ్ హీరోలు పోటీ పడుతున్నారు.
మే మొదటి వారంలో మే 5 న అల్లరి నరేష్-గోపీచంద్ ఇద్దరూ నువ్వా-నేనా అని బాక్సాఫీసు ఫైట్ షురూ చేసారు. రెండు సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలే. కానీ ప్రమోషన్స్ పరంగా రెండు సినిమాలు విపరీతంగా పోటీపడుతున్నాయి. ఇప్పటికే అల్లరి నరేష్ ఉగ్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. కారణం నాంది సినిమాతో విజయ్ కనకమేడల అల్లరి నరేష్ కి మంచి హిట్ ఇవ్వడంతో, ఇప్పుడు ఇదే కాంబోలో ఉగ్రం రావడం, ప్రమోషన్స్ పరంగా కొత్తదనం ఇవన్నీ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
ఇక గోపీచంద్ కూడా రామ బాణం సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. హీరోయిన్ డింపుల్ హయ్యతితో కలిసి బుల్లకితెర షోస్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, దర్శకుడు తేజ తో ఇంటర్వ్యూ ఇలా ఆసక్తికరంగా సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. జగపతి బాబు-గోపీచంద్ అన్నదమ్ములుగా కనిపిస్తున్న ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కింది.
ప్రమోషన్స్ పరంగా ఉగ్రం-రామ బాణం ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించడంలో మేకర్స్ పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యారు. అందుకే ఈ శుక్రవారం బాక్సాఫీసు షేకే అనేది.