గత ఐదు రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అలాగే ప్యాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. సుకుమార్ ఇంటిపై ఆదివారంతో ఈ దాడులు పూర్తి కాగా.. మైత్రి మూవీ మేకర్స్ పై జరిగిన సోదాలు ఈరోజుతో పూర్తి కావడంతో ఐటి అధికారులు మైత్రి మూవీలో జరిగిన లావాదేవీలు, ఈ నిర్మాణ సంస్థతో పని చేసిన, చేస్తున్న హీరోలపై ఐటి అధికారులు దృష్టి సారించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు హవాలా రూపంలో హీరోలకి, దర్శకులకి పారితోషకాలు చెల్లించినట్టుగా ఈ సోదాల్లో అధికారులు గుర్తించారు.
ముంబై కి చెందిన ఏడు కంపెనీల నుండి మైత్రి వారికి 700 కోట్లు హవాలా రూపంలో రాగా.. దానితో వారు సినిమాలపై పెట్టుబడులు పెడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. బాలీవుడ్ దర్శకుడుకి మైత్రి నిర్మాతలు 150 కోట్ల రూపాయలు ఈ హవాలా ద్వారా చెల్లించినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకి పెద్ద మొత్తంలో అనుమానాస్పద ట్రాన్సిక్షన్స్ జరిగినట్టుగా గుర్తించారు. అలాగే ప్రస్తుతం ఓ బడా సీక్వెల్ చేస్తున్న హీరోకి కూడా ఈ హవాలా రూపంలోనే మైత్రి వారు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్టుగా అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం మైత్రి మూవీస్ తో పని చేసిన స్టార్స్ ఖాతాలను కూడా ఐటి శాఖ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ హీరోకి ఎంత పెద్ద మొత్తంలో డబ్బుని మళ్లించారనే విషయంలో ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. ముంబై కి చెందిన హీరోలని విచారణకు పిలిచే అవకాశం ఉంది అని.. ఈ హవాలాలో ఈడీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.