గత నాలుగైదు రోజులుగా దర్శకుడు సుకుమార్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా వున్న దర్శకనిర్మాతల ఇళ్లపై ఈ రకమైన ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశం అయ్యింది. ఏ ఒక్కరోజో కాకుండా ఏకంగా నాలుగైదు రోజుల నుండి సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లపై ఈ రకమైన సోదాలు నిర్వహించడంతో పుష్ప ద రూల్ షూట్ పై ఎఫెక్ట్ పడడం అటుంచి మైత్రి మూవీ మేకర్స్ లో ఒకరైన నవీన్ ఎర్నేని హై బీపీతో ఆసుపత్రిలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.
ఆర్థికలావాదేవీలు, జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడడం, లెక్కల్లో చూపని ఆస్తులని కొనుగోలు చెయ్యడమే ఈ దాడులు ప్రధాన లక్ష్యంగా సాగగా.. నిన్న ఆదివారం రాత్రితో సుకుమార్ ఇల్లు, ఆఫీస్ లపై ఐటి అధికారులు సోదాలు ముగించినట్లుగా తెలుస్తుంది. అటు మైత్రి మూవీ మేకర్స్ ఇల్లు, ఆఫీస్ లపై కూడా ఐటి దాడులు ముగిసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్స్, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.