హీరోల అభిమానులు హద్దులు దాటుతున్నారనే మాట ఎప్పటినుండో కాదు ఎన్నో ఏళ్ళ నుండి వినిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్-ఏఎన్నార్ దగ్గర నుండి ఈ అభిమానుల మధ్యన అంతర్యుద్ధాలు, మాటల యుద్దాలు, కోల్డ్ వార్ లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా అభివృద్ధి చెందాక ఆ ఫాన్స్ వార్ మరింతగా ముదిరిపోయింది. అసభ్యకరమైన మాటలతో గొడవ పడడమే కాదు.. కొట్టుకునే స్థాయికి అభిమానులు చేరుకున్నారు. ప్రభాస్ అభిమానులు vs పవన్ అభిమానులు, మెగా vs నందమూరి, అక్కినేని vs నందమూరి ఇలా హీరోల అభిమానులు కొట్టుకుచచ్చిపోతున్నారు.
హీరోలు స్నేహంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈగోలకి పోకుండా కలిసి సినిమాలు చేస్తున్నారు. అయినా అభిమానుల మధ్యన ఈ వార్ అనేది ముగియడం లేదు. అభిమానుల మధ్యన యుద్ధమనేది ఆరోగ్యకరంగా ఉంటే అందరికి మంచిదే అదే హద్దులు దాటితే హత్యలకు దారి తీస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ అభిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని హత్య చెయ్యడం హాట్ టాపిక్ కాదు టూ మచ్ గా తయారైంది.
చిన్న చిన్న విభేదాలే హత్యలకు దారి తియ్యడం అనేది ఎంత పెద్ద దారుణం. ఏలూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని కిషోర్, ప్రభాస్ అభిమాని హరి కుమార్ లు ఇద్దరు వృత్తి రీత్యా అత్తిలి వెళ్లారు. వారు తిరిగి రాత్రి ఏలూరుకు చేరుకునే సమయంలో తమ హీరోల గురించిన చర్చ మొదలయ్యింది. ఆ మాటల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కిషోర్ తన హీరో పవన్ కళ్యాణ్ పిక్ ని స్టేటస్ పెట్టుకున్నాడు. అయితే హరి కుమార్ వాట్సాప్ స్టేటస్ ని ప్రభాస్పె పిక్ పెట్టమని ఒత్తిడి చెయ్యడంతో ఇద్దరి మధ్యన గొడవ మొదలయ్యింది.
కిషోర్ ప్రభాస్ పిక్ పెట్టనని మొండికెయ్యడంతో హరి కుమార్ కోపంతో కిషోర్ తల, ముఖంపై సెంట్రింగ్ పైపుతో కొట్టాడు. గాయాలపాలైన కిషోర్ మృతి చెందగా హరికుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా చూస్తుంటే అభిమానం హద్దులు దాటి వెర్రితలలు వేసింది అనే చెప్పాలి. అభిమానుల మధ్యన పోరుతో హరి కుమార్ చేసిన పనికి కిషోర్ ఫ్యామిలీ ఈరోజు దిక్కులేని స్థితిలో పడింది. ఇక్కడ పవన్, ప్రభాస్ ఇద్దరూ బాగానే ఉన్నారు. మధ్యలో కొట్టుకు చచ్చింది ఎవరు సామాన్యులు. అభిమానం ఉండాలి.. ఇంతలా ముదిరి సైకోలా తయారయ్యేంతగా ఉండడకూడదు.